`మా` గొడవ రావణ కాష్టంగా రగులుతూనే ఉంది. ఎన్నికలు పూర్తయి, అధికారం చేతులు మారినా.. ఆ సెగ చల్లారడం లేదు. `మా పనులకు అడ్డుపడుతున్నాడు – మా సీటు వదలడం లేదు` అంటూ నరేష్ బృందం ప్రెస్ మీట్ పెట్టి తమ ఆవేదన వెళ్లగక్కింది. ఇప్పుడు శివాజీ రాజా వంతు వచ్చింది. `మా`లో అసలేం జరుగుతుంది? తనపై ఇలా ఆరోపణలు రావడానికి కారణమేంటి? ఓడిపోవడం వెనుక ఎవరి కుట్ర ఉంది? అనే విషయాల్ని శివాజీ రాజా బయటపెట్టాడు. ఈ ప్రెస్ మీట్లో హైలెట్స్
- ఓల్డేజ్ హోం నా ఓటమికి కారణం. ఎవడో భీమవరం నుంచి సంచి పట్టుకుని వచ్చాడు, మేం అందరం చేయని పని వీడొక్కడే చేస్తాడా? వీడికే పేరు రావాలా? అని కొంతమంది చేసిన కుట్ర వల్ల ఓడిపోయాను.
- వాళ్లు పనిచేసుకుంటానంటే అడ్డు పడడానికి నేను ఎవర్ని? అయితే బై లా ప్రకారం.. కొత్త అధ్యక్షుడు ఏప్రిల్ 1 నుంచి పనులు ప్రారంభించాలి. ఈలోగా పనులు మొదలెడితే.. ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. లేనిపోని గొడవలెందుకు అని నేను సర్దిచెప్పే ప్రయత్నం చేశా. దాన్ని తప్పుగా అనుకున్నారు?
- ఎన్నికలలో గెలిచిన తరవాత మన ప్రవర్తన ఎంత హుందాగా ఉండాలి? అయితే నా మాటల్ని ఎటకారం చేయడం మొదలెట్టారు. ఆఖరికి అరుణాచలం వెళ్లిపోతా అనే మాటమీద కూడా జోకులు వేశారు.
- అమెరికా లో ఓ కార్యక్రమం నిర్వహించి రెండు కోట్ల వరకూ రాబడదామనుకున్నాం. కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. కమిటీలో ఎవరి తప్పూ లేదని తేలిపోయింది. అయితే అందులో ఏదో అవకతవకలు జరిగిపోయినట్టు మాట్లాడుతున్నారు.చిరంజీవి గారి అధ్యక్షతన ఏర్పడిన కమిటీ పై నిందలు వేస్తారా? ఇది చిరంజీవిగారిని అవమానించినట్టే.
- మహేష్ బాబుతో ఓ కార్యక్రమం చేసి రూ.2 కోట్లు తీసుకొద్దామనుకున్నాం. రాబోయే మూడు నెలల్లో నరేష్ బృందం ఈ కల సాకారం చేస్తే.. నేను సంతోషంగా వాళ్లకు దండం పెట్టి, కాళ్లకు నమస్కరిస్తా.
- బిజినెస్ క్లాస్ టికెట్లలో ప్రయాణం చేసి `మా` నిధుల్ని దుర్వినియోగం చేశామని నరేష్ అన్నారు. స్టార్ హీరోలకు బిజినెస్ క్లాస్ టికెట్లు వేయకపోతే వాళ్లు వస్తారా? మలేసియాలో పరుచూరి వెంకటేశ్వరరావు, నేనూ ఓ మామూలు డబుల్ కాట్ బెడ్ రూమ్లో ఉంటే, నరేష్ సూట్ రూమ్ తీసుకున్నాడు. తాగేసి ఫ్లయిట్ మిస్సయిపోతే. మరో ఫ్లయిట్కి టికెట్ తీసుకోవాల్సివచ్చింది. లండన్, అమెరికా షూటింగులకు వెళ్లేటప్పుడు నరేష్ బిజినెస్ క్లాస్ టికెట్ డిమాండ్ చేస్తాడు. నిర్మాతలపై అంత గౌరవం ఉంటే.. సాధారణ క్లాసులోనేరావొచ్చు కదా?