ఇటీవల చిత్రసీమని చుట్టిముట్టిన వివాదాలలో పరోక్షంగా `మా` వైఫల్యం కూడా ఉంది. శ్రీరెడ్డి పై నిరంకుశత్వ ధోరణితో వ్యవహరించడం వల్లే ఈ వ్యవహారం బాగా ముదిరిపోయిందని ఇండ్రస్ట్రీ పెద్దలు సైతం బహిరంగంగానే చెప్పారు. విష్ణు అయితే..`మా` వైఖరి ఎండగడుతూ ఓ లేఖ రాశాడు. అందులో ‘మా’ వైఫల్యాలను ఎత్తి చూపించాడు. వీటన్నింటికీ బాధ్యత వహిస్తూ ‘మా’అధ్యక్షుడు శివాజీ రాజా రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇండ్రస్ట్రీ పెద్దలతోనూ ఆయన చూచాయిగా చర్చించారని తెలుస్తోంది. ఈరోజు పవన్ కల్యాణ్ ఫిల్మ్ ఛాంబర్లోకాస్త హడావుడి చేయడంతో – ఈ సీన్ మొత్తం పక్కకు వెళ్లిపోయిందని సమాచారం. ఒకట్రెండు రోజుల్లో శివాజీ రాజా నుంచి ఇలాంటి ప్రకటనేదో వచ్చే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీరెడ్డి వివాదాన్ని పక్కన పెడితే… శివాజీ రాజా `మా` విషయంలో చాలా పాటు పడ్డాడు. `మా` సిల్వర్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇది వరకటి `మా` కంటే.. శివాజీ రాజా అన్ని విషయాల్లోనూ మెరుగే. అలాంటి శివాజీరాజాని చిత్రసీమ ఎందుకు వదులుకుంటుంది? అందుకే రాజీనామా చేస్తానన్నా… ఆయన్ని బుజ్జగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.