హైదరాబాద్: అప్పుటి ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు పవన్నే కులమతాలకతీతంగా తెలుగుప్రజలు అభిమానిస్తున్నారని నటుడు శివాజీ అన్నారు. అయితే పవన్కికూడా ఆ విషయం తెలియదని చెప్పారు. ఇవాళ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య ఆధ్వర్యంలో ఏలూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సభలో శివాజి మాట్లాడుతూ, తాను ప్రతిచోటా పవన్ పేరును ప్రస్తావించటాన్ని కొందరు విమర్శిస్తున్నారని చెప్పారు. తానలా ప్రస్తావించటానికి కారణముందని అన్నారు. పాలిచ్చే ఆవును పట్టుకుంటే పాలు లభిస్తాయిగానీ, దున్నపోతును పట్టుకుని ఎంత వేళ్ళాడినా ఉపయోగమేముంటుందని ప్రశ్నించారు. పవన్ అత్యంత ప్రజాదరణ కల నాయకుడు కాబట్టే తాను ఆయన పేరును ప్రస్తావిస్తున్నానని చెప్పారు. పవన్ రోడ్డెక్కితే ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్వం పదవిలో ఉన్నప్పుడులా లేరని అన్నారు. తమకు ఇప్పటి చంద్రబాబు వద్దని, అప్పటి చంద్రబాబు కావాలని చెప్పారు. ఇప్పుడు ఆయనను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం అవినీతిమయమైపోయిందని అన్నారు. ఎంపీలు మనస్సాక్షిగా ప్రత్యేకహోదాకోసం పనిచేయటంలేదని చెప్పారు. టీడీపీ వైసీపీ నేతలు తిట్టుకోవటానికి సమయం చాలటంలేదని విమర్శించారు.