మేఘా ఇంజినీరింగ్ కంపెనీతో కుమ్మక్కయ్యి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశద్రోహానికి పాల్పడుతున్నారని సినీ నటుడు శివాజీ అంటున్నారు. చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. దేశానికి మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ద్రోహం చేసిందని.. ఈ కంపెనీ చేస్తున్న నిర్వాకాల వల్ల భావితరాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేఘా ఇంజినీరింగ్ చేపట్టిన ప్రాజెక్టులు, చేసిన అవినీతి .. ప్రజల సంపదను ఎలా దోపిడీ చేస్తున్నారో సమగ్రంగా వివరిస్తూ… ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానిలకు సైతం ఫిర్యాదు చేశానన్నారు. ఇక ముందు నుంచి వారానికో సారి… మేఘా ఇంజినీరింగ్ కంపెనీ అక్రమాల గురించి సాక్ష్యాలతో సహా బయట పెడుతూ వీడియోలు రిలీజ్ చేస్తానని ప్రకటించారు. అంటే ఆయన వీడియో ఇప్పుడు టీజర్ లాంటిదన్నమాట.
మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఇప్పుడు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అత్యంత ప్రీతిపాత్రమైన కంపెనీ. తెలంగాణలో కాళేశ్వరం, మిషన్ భగీరధ లాంటి భారీ ప్రాజెక్టుల్లో మేఘా ఇంజినీరింగ్ కంపెనీనే పనులు చేస్తోంది. ఈ రెండింటి బడ్జెట్ … రూ. లక్షన్నర కోట్లకుపైమాటే. ఇది కాకుండా.. తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్‌ను.. కూడా.. మేఘా ఇంజినీరింగ్ కు చెందిన సంస్థనే దక్కించుకుంది. ప్రభుత్వం మారిన తర్వాత.. ఏపీలోనూ మేఘా కృష్ణారెడ్డి ప్రభుత్వాధినేతతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లిన ప్రభుత్వానికి రూ. 800 కోట్లు తక్కువకు పనులు చేస్తానని టెండర్ వేశారు. నిజానికి అవే పనులకు ఆరు నెలల ముందు… రూ. మూడు వందల కోట్లు ఎక్కవ కావాలని మేఘా కంపెనీ టెండర్ వేసింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే సరికి.. భారీ మొత్తం ఎందుకు తగ్గించారోననే చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఈ కోణంలో ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహారం తెరపైకి వచ్చింది.
శివాజీకి మేఘా కంపెనీపై.. వ్యక్తిగతంగా కూడా… ఆగ్రహం ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకంటే.. టీవీ9 కొత్త యాజమాన్యంలో మేఘా కృష్ణారెడ్డి కూడా ఒకరు. తమపై పోలీసులు కేసులు పెట్టడానికి కారణాల్లో కృష్ణారెడ్డి కూడా ఒకరని రవిప్రకాష్, శివాజీలు నమ్ముతున్నారు. అంతే కాదు.. టీవీ9 కొనుగోలు ప్రక్రియలో… వారు మోసానికి పాల్పడ్డారని చాలా రోజులుగా.. రవిప్రకాష్, శివాజీ ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. మేఘా సంస్థకు చెందిన అక్రమాలను.. వెలికి తీసి బయట పెట్టేందుకు శివాజీ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. అయితే శివాజీ ఎలాంటి ఆధారాలు బయట పెట్టబోతున్నారు… అనేది రాజకీయ, వ్యాపారవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది.