జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్, తమిళ హీరో శివ కార్తికేయన్ తో చేస్తున్న సినిమా ప్రిన్స్. ఈ నెల 21 దీపావళి కానుకగా విడుదలౌతుంది. ఈ సినిమాని బైలింగ్వల్ అని మొదటి నుండి ప్రచారం చేశారు. శివ కార్తికేయన్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేస్తున్నాడని తెగ హడావిడి చేసేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ వచ్చింది. భూతద్దం పెట్టి వెదికినా ఒక్క ప్రముఖ తెలుగు నటుడు కనిపించలేదు ట్రైలర్ లో.
ఇక కంటెంట్ అంతా తమిళ వాసనే కొట్టింది. శివకార్తికేయన్ డబ్బింగ్, లిప్ సింక్ గమనిస్తే అసలు ఈ సినిమాని తెలుగు షూట్ చేయలేదనిపిస్తుంది. కేవలం ప్రచారానికి తప్పితే తెలుగు కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోలేదని అర్ధమైపోయింది. ట్రైలర్ కూడా అంత హిలేరియస్ గా లేదు. ఒక ఇండియన్, బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించడం దాంతో వచ్చే చిక్కులు. ఈ లైన్ కి ఆనుదీప్ టచ్ కామెడీ. ట్రైలర్ లో వినిపించిన డైలాగులు తెలుగు నటులు చెబితే కొంత హాస్యం పండేది. కానీ అంతా తమిళ బ్యాచే కావడం వలన పొడిపొడిగానే అనిపించింది. మొత్తానికి ఇది పక్కా తమిళ సినిమా అనే సంగతి తేలిపోయింది.