కథల్లో, కల్పితాల్లో, వార్తల్లో… తరచూ వినిపించే పదం ఏలియన్. నిజంగానే ఏలియన్లు ఉన్నారా? వాళ్లు కిందకి వస్తారా? అంటే సమాధానం లేదు. కానీ ఏలియన్ అనే మాట వినిపించినప్పుడల్లా ఆసక్తి కలుగుతుంది. వాళ్ల గురించి తెలుసుకోవాలనిపిస్తుంటుంది. ఓ సినిమాకి ఇంతకంటే యూఎస్పీ ఏముంటుంది? ఇదే పాయింట్ పట్టుకొని `ఆయలాన్` సినిమా తీసేశారు. శివకార్తికేయన్ హీరో. రవికుమార్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న విడుదల అవుతోంది. ట్రైలర్ ఇప్పుడు వదిలారు.
ఏలియన్ కథలంటే సైన్స్ ఫిక్షన్ రూపంలో గంభీరంగా ఉంటాయనుకొంటాం. కానీ ఈ సినిమా వేరే దారిలో ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. ఏలియన్ తో అచ్చతెలుగు (డబ్బింగ్ కాబట్టి తెలుగులో లేదంటే తమిళమే) మాట్లాడించారు. మాస్ డైలాగులు కూడా పలికించారు. మొత్తానికి ఓ బొమ్మని చేసి ఆడించేశారు. ఏలియన్ ఈ భూమ్మీదకు ఓ కారణంతో వస్తుంది. అదేమిటి? అందుకు హీరో ఎలాంటి సహాయం అందించాడన్నది కథ. శివకార్తికేయన్ కథలు వెరైటీగా ఉంటాయి. ఏ పాయింట్ పట్టుకొన్నా.. దానికి వినోదం జోడిస్తాడు. ఈ సినిమాలోనూ అది పుష్కలంగా ఉన్నట్టే కనిపిస్తోంది. పర్యావరణానికి సంబంధించిన ఓ పాయింట్ ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు. గ్రాఫిక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కొన్ని చోట్ల వావ్ అనిపించిన గ్రాఫిక్స్, కొన్ని చోట్ల తేలిపోయాయి. మొత్తానికి `అయలాన్`లో మేటర్ ఉన్నట్టే కనిపిస్తోంది. కాకపోతే సంక్రాంతికి వస్తోంది. తెలుగులో సంక్రాంతి సినిమాల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. తెలుగు హీరోలకే థియేటర్లు దొరకడం లేదు. వాటి మధ్య ఈ తమిళ ఏలియన్ నలిగిపోతుందో.. లేదంటే తన ఉనికిని చాటుకొంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.