కాంగ్రెస్‌లో చేరి చక్రం తిప్పాలనుకున్న ప్రశాంత్ కిషోర్‌కు అక్కడ అడ్డుపుల్లపడింది. దాంతో కాంగ్రెస్‌ను లేకుండా చేసి మమతా బెనర్జీని ఆ ప్లేస్‌లోకి తేవాలని తన ఫిరాయింపుల వ్యూహ రాజకీయాలను ప్రయోగిస్తున్నారు. అయితే అది ఆయన అనుకున్నంత సులువుగా లేదు. మమతా బెనర్జీతో యూపీఏ ఎక్కడుంది అనిపించినా… కాంగ్రెస్ పార్టీ కూటమిలోనే ఉండేందుకు ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు సుముఖత చూపుతున్నాయి. శివసేన కూడా యూపీలోనే భాగస్వామి అవ్వాలని నిర్ణయించుకుంది .
ఇప్పటి వరకూ మహారాష్ట్రలో మాత్రమే కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని శివసేన చెబుతూ వస్తోంది. ఇప్పుడు జాతీయంగా కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని.. యూపీఏ కూటమిలో భాగమవుతామని ప్రకటించింది. ఇది మమతా బెనర్జీకి మరింత ఇబ్బందికరమే. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు… బీజేపీ వైపు కాకపోతే కాంగ్రెస్ వైపు ఉండాలనుకుంటున్నాయి కానీ మమతా బెనర్జీ వైపు ఉండాలనుకోవడం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ కూడా మమతా బెనర్జీ కన్నా కాంగ్రెస్ బెటరనుకుంటోంది. బీజేపీ పరిస్థితి దిగజారుతోందని అనిపిస్తే మరిన్ని పార్టీలు కాంగ్రెస్ చెంత చేరే అవకాశం ఉంది.
వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలితే తర్వతా రాజకీయాలు పూర్తి స్థాయిలో మారే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్కూటమిలో చేరే పార్టీల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పీకే వ్యూహాలు మమతా బెనర్జీని ఒంటరినిచేస్తాయి కానీ.. జాతీయ నేతగా నిలబెట్టలేవన్న అభిప్రాయాలు ఢిల్లీలో వినిపిస్తున్నాయి.