ఆంధ్రప్రదేశ్‌లో మానవహక్కులు.. జీవించే హక్కులు.. వాక్ స్వాతంత్ర్యం అనేవి ఏవీ ఉండవు. ఏదైనా నాకు స్వాతంత్ర్యం ఉంది అనుకుంటే.. సాయంత్రానికి ఇల్లు కూడా కూలిపోవచ్చు. అలాంటి పరిస్థితికి ముఖ్యమంత్రి జగన్ ఇంటికి కూత వేటు దూరంలో ఉండే శివశ్రీ అనే మహిళే సాక్ష్యం. ఆమె ఇంటిని రాత్రికి రాత్రే అధికారులు కూల్చివేశారు. జేసీబీలు తీసుకు వచ్చి.. జోరువానలోనూ… లైట్లు వేసుకుని మరీ కూల్చివేశారు. ఇంతా చేసి శివశ్రీ ఎవరో కాదు. .. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఘనంగా ప్రవేశ పెట్టిన వ్యవస్థలో భాగమైన వాలంటీర్. ఇంతకీ ఆమె చేసిన తప్పేమిటంటే.. న్యాయం కోసం విపక్ష నేతల వద్దకు వెళ్లడం.
శివశ్రీ అనే మహిళ తాడేపల్లి కాలువకట్టపై ఉన్న అమరారెడ్డి నగర్లో నివరిస్తుంది. అక్కడంతా వైసీపీ అభిమానులే. అక్కడ వాలంటీర్‌గా శివశ్రీ అనే మహిళ పని చేస్తోంది. జగన్ అభిమాని కాబట్టి.. ఆమెను వాలంటీర్‌గా స్థానిక నేతలు నియమించారు. ఆమె కూడా ప్రభుత్వం తరపున.. వైసీపీ తరపున చేయాల్సిన పనిని చేస్తోంది. అయితే.. ఆ అమరారెడ్డి నగర్ సీఎం జగన్ ఇంటికి పొరుగున ఉండటమే శాపం అయింది. ఆ కాలనీని కూలగొట్టాలని అధికారులు డిసైడయ్యారు. అందరికీ …ఎక్కడెక్కడో స్థలాలు చూపించి వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చారు. ఇళ్లు కట్టివ్వలేదు.. స్థలాలు మాత్రమే ఇచ్చారు. భయపడిన చాలా మంది వెళ్లిపోయారు.కానీ శివశ్రీ మాత్రం.. ఎదురు నిలవాలనుకున్న కొద్ది మంది తరపున పోరాటం ప్రారంభించింది. మొదట పవన్ కల్యాణ్‌ను కలిసి.. తమ గోడు వెళ్లబోసుకుంది. తర్వాత ఇతర విపక్ష నేతలనూ కలిసింది. దీంతో.. ఆమెపై వైసీపీ నేతలు పగ బట్టారు.
బుధవారం ఉదయమే ఆరు గంటలకు పోలీసులు ఆమెను తీసుకెళ్లారు. రోజంతా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టారు. ఈ విషయం మీడియాలో హైలెట్ కావడంతో.. సాయంత్రం విడిచిపెట్టారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అవినీతి విపరీతంగా ఉందన్నారు. అంతే.. ఆమె ఇంటికి వెళ్లేలోపు.. ముందు రోజు తేదీతో.. నోటీసులు అంటించి ఉన్నారు. ఇల్లు కూలగొడతాం అని హెచ్చరిక నోటీసు అది. నోటీసులతో పాటే.. జేసీబీలు వచ్చాయి. జోరు వాన పడుతున్నా.. కూల్చివేత ప్రారంభించారు. అచ్చంగా ప్రజావేదికను కూల్చివేసినట్లు కూల్చివేసి.. శిథిలాలు అక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయారు.
శివశ్రీ విషయంలో అధికారులు.. ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త చర్చ జరుగుతోంది. ఏ ప్రభుత్వమైనా.. ప్రజల పట్ల ఇంత కఠినంగా వ్యవహరించగలదా.. అన్న సందేహాలు చాలా మందిలో వస్తున్నాయి. పైగా ఆమె వైసీపీ అభిమాని..వాలంటీర్.. అంతకు మించి ఆమె…న్యాయం కోసమే.. అడుగుతోంది. తన ప్రభుత్వంలో తనకు న్యాయం జరుగుతుందని ఆశించింది. కానీ నోరెత్తితే.. జరిగేది న్యాయం కాదని.. రోడ్డు మీద పడటమేనని.. ప్రభుత్వం నిరూపించింది.
కొసమెరుపేమిటంటే.. సీఎం జగన్ తాడేపల్లి నుంచి ఎప్పుడెప్పుడు విశాఖకు మకాం మారుద్దామా అని ఆత్రుతగా ఉన్నారు. అయినా ఆయన ఇంటిపక్కన ఆ పేదల కాలనీ ఉండకూడదనుకున్నారేమో కానీ.. సొంత మద్దతుదారులనైనా వదల్లేదు.