బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వలసలు ఆగటం లేదు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతుండగా… వలసలను ఆపేందుకు ఆ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. తాజాగా గ్రేటర్ పరిధిలోని మరో ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
ఊగిసలాటలో ఉన్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సీఎం సమక్షంలో పార్టీ మారుతున్నారు. బీఆర్ఎస్ అధినాయకత్వానికి కూడా సమాచారం అందించారు. ప్రకాష్ గౌడ్ తో పాటు ఉప్పల్, ఎల్.బి నగర్ ఎమ్మెల్యేలు కూడా లిస్ట్ లో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు లీకులిస్తున్నాయి. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యే వివేకానందలు కూడా ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ గూటికి చేరటం ఖాయమైపోయినట్లు ప్రచారం జరుగుతోంది. వీరికి తోడు ఓ ఎమ్మెల్సీ కూడా క్యూలో ఉన్నారని సమాచారం.
అయితే, ఈ ఆరుగురు చేరికలు పూర్తయ్యాక… అసెంబ్లీ మొదలయ్యే లోపు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉత్తర తెలంగాణ నుండి చేరేందుకు రెడీ గా ఉన్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటికే వీరు సీఎంను కలిశారని, గ్రీన్ సిగ్నల్ రాగానే చేరికలుంటాయని తెలుస్తోంది. ఇందులో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులకు అత్యంత సన్నిహిత ఎమ్మెల్యే కూడా ఉన్నారని సమాచారం.