జూన్‌లో సత్యసాయి జిల్లాలో ఆటోపై కరెంట్ తీగలు పడి ఐదుగురు సజీవ దహనం అయిన ఘటన ఇంకా మర్చిపోలేదు. ఎందుకంటే ఆ తీగలు తెగిపడటానికి కారణం ఉడుత అని తేల్చి.. దానికి పోస్టుమార్టం కూడా చేశారు ఘనత వహించిన ప్రభుత్వ నిపుణులు. అది చర్చల్లో ఉండగానే మరోసారి అదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరోసారి కరెంట్ తీగలు తెగిపడి.. ఈ సారి ఆరుగురు చనిపోయారు. ట్రాక్టర్ పై పడటంతో ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. అప్పుడూ.. ఇప్పుడూ చనిపోయింది వ్యవసాయ కూలీలే.
బొమ్మనహాళ్ మండలం.. దర్గాహోన్నూరు దగ్గర ట్రాక్టర్‌పై కరెంట్ తీగలు తెగి పడటంతో ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వ్యవసాయ కూలీలు. సమీపంలో మొక్కజొన్న పంట కోతకు వెళ్తూండగా ఈ ఘటన జరిగింది. బాధితులందరూ.. దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన వారు. కరెంట్ తీగలు ఎలా తెగిపడ్డాయన్నదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే.. గతంలో జరిగిన ప్రమాదం అందరికీ గుర్తొచ్చింది.
హైటెన్షన్ వైర్లు తెగిపడాలంటే.. చాలా పెద్ద ప్రమాదం జరగాలి. కేవలం షార్ట్ సర్క్యూట్ అయితేనో.. మరొకటో అయితే తెగి పడవు. ఇంకా విషయం ఏమిటంటే.. ఇలా ఉడుతలు.. పక్షుల వల్ల అయితే.. ముందుగా విద్యుత్ లైన్ ట్రిప్ అయి సరఫరా ఆగిపోతుంది. కానీ ఇక్కడ అలాంటివేమీ జరగడం లేదు. వైర్లలో కరెంట్ ప్రవహిస్తోంది. అంటే.. వైర్లే తెగిపడుతున్నాయని స్పష్టంగాతెలుస్తోంది. కానీ విద్యుత్ తీగల కాంట్రాక్టులను.. తీసుకుని నాసి రకం తీగలను సరఫరా చేసిన పెద్దల గుట్టు బయటపడకుండా.. ఉడుతలు.. పక్షలను బలి చేసి.. సైలెంట్ అయిపోతూంటుంది ప్రభుత్వం. కానీ ప్రజల ప్రాణాలు మాత్రం ఎప్పటికప్పుడు పోతూనే ఉన్నాయి.