తెదేపా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంతవరకు ప్రతిపక్ష పార్టీల నుండి వలసలను పెద్దగా ప్రోత్సహించలేదు. ఎందుకంటే ఆ పార్టీ ఇప్పటికే ‘ఓవర్ లోడ్’ అయ్యుండటమే కారణం. అందుకే అనేకమంది కాంగ్రెస్ నేతలు తెదేపాలో చేరేందుకు ఆసక్తి చూపించినా వారికి ఆహ్వానం పలుకలేదు. జేసీ బ్రదర్స్, ఆనం బ్రదర్స్, డొక్కా మాణిక్యవర ప్రసాద్ వంటి కొద్ది మందిని మాత్రమే పార్టీలో చేర్చుకొంది. కానీ భూమానాగి రెడ్డి వ్యవహారం మొదలయిన తరువాత, ‘తెదేపా నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేలకి ఫోన్లు చేసి పార్టీ మారమని ప్రలోభపెడుతున్నారని, లొంగకుంటే బెదిరిస్తున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణాలో తెదేపా తుడిచిపెట్టుకు పోతుండటంతో తమతో మైండ్ గేమ్ ఆడటం మొదలు పెట్టిందని వారి వాదన.
వైకాపా ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు తెదేపా నేతలు ప్రయత్నించడం నిజమే కావచ్చును. కానీ తెదేపాకు ఆ ఆలోచన కల్పించింది మాత్రం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డేనని చెప్పక తప్పదు. “21 మంది తెదేపా ఎమ్మెల్యేలు మాతో టచ్చులో ఉన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని” జగన్మోహన్ రెడ్డి అనవసరమయిన మాటలు మాట్లాడటం వలననే తెదేపా కూడా పావులు కదపడం మొదలుపెట్టింది. పోనీ ఇంత జరిగిన తరువాత అయినా వైకాపా నేతలు తమ తప్పును సరిదిద్దుకొనే ప్రయత్నం చేసారా..అంటే అదీ లేదు. ‘ఆవు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా…’అన్నట్లు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 21 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారని గొప్పలు చెప్పుకొంటే, మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి 6మంది తెదేపా ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారని వారు కొన్ని నెలల తరువాత వైకాపాలోకి వచ్చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఈరోజు ప్రకటించారు. కానీ వారి పేర్లను బయటపెట్టడానికి ఆయన అంగీకరించలేదు.
వైకాపా నుండి తెదేపాలోకి రావలనుకొన్న ఎమ్మెల్యేలు వచ్చేసారు. కనుక రామకృష్ణా రెడ్డి చెప్పిన మాటలు నిజమనుకొంటే తెదేపా నుండి వైకాపాలోకి వెళ్ళాలనుకొంటున్న ఎమ్మెల్యేలు కూడా వెళ్లిపోవచ్చును కానీ ఇంకా కొన్ని నెలలు ఆగుతారుట..దేనికో తెలియదు. అయినా బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లుగా ఎక్కడయినా అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీల నుండి వలసలు ఉంటాయి తప్ప అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీలలోకి వలసలు ఉండవు కదా? ఒకవేళ దగ్గరలో ఎన్నికలున్నట్లయితేనే రాజకీయ నేతలు అటువంటి ఆలోచనలు చేస్తుంటారు. మరో మూడేళ్ళవరకు ఎన్నికలు లేవు. వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. మరి అటువంటప్పుడు అధికార పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోకి వెళ్ళవలసిన అవసరం ఏముంది అని ఆలోచిస్తే వైకాపా కూడా తెదేపాతో మైండ్ గేమ్స్ ఆడుతోందని అర్ధమవుతోంది.
కనుక ఒకవేళ తెదేపా కూడా మైండ్ గేమ్స్ ఆడుతున్నా, వైకాపా ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నా దానిని నిందించవలసిన అవసరం లేదు. ఎందుకంటే వైకాపా కూడా అదే పొరపాట్లు చేస్తోంది కనుక.