హైదరాబాద్: హైదరాబాద్‌లో విధ్వంసానికి కుట్ర పన్నుతున్న ఆరుగురు విదేశీయులను తెలంగాణ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు బాంగ్లాదేశ్, ఇద్దరు పాకిస్తాన్, ఒకరు మయన్మార్ దేశాలకు చెందినవారు. వీరికి హుజీ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు ప్రాధమిక విచారణలో తెలిసిందని పోలీసులు చెప్పారు. మరో 15మంది సానుభూతిపరులను అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్యదినోత్సవంసందర్భంగా ఉగ్రవాదులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించటంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు జరుపుతుండగా వీరు దొరికారు. వీరు దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ళు జరిపినవారికి సాయంచేశారని, వారు పేలుళ్ళ తర్వాత పారిపోయేందుకు సాయం చేశారని పోలీసులు చెప్పారు. చంచల్‌గూడ ప్రాంతంనుంచి వీరి కార్యకలాపాలు సాగుతున్నాయని, ప్రధానంగా నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారని వెల్లడించారు. వీరివద్దనుంచి 4 పాస్‌పోర్టులు, 100 ఓటర్ ఐడీ కార్డులు, 9 సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.