వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 2025 మార్చి పదిహేనో తేదీకి ఖచ్చితంగా ఆరేళ్లు. 2019 మార్చి 15న జగన్ అభ్యర్థులను ప్రకటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఈ హత్య జరిగింది. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినా బాబాయి హంతకుల్ని పట్టుకోలేదు. ఇప్పుడు మరో ఏడాది గడిచిపోతోంది. కానీ హంతకులు మాత్రం దొరకలేదు. దర్యాప్తు జరగడం లేదు. కోర్టులో ఏదో రొటీన్ గా ..కేసు విచారణకు వచ్చి వాయి పడుతోంది. కానీ న్యాయం కోసం వివేకా కుమార్తె ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు.
చేధించాలనుకుంటే రెండు గంటల్లో అయిపోయే కేసు !
నేరం చేసిన వాడే సాక్ష్యాలను తుడిచే ప్రయత్నం చేస్తాడన్నది క్రిమినల్ లాలో అందరికీ తెలిసిన విషయం. ఎవడో దొంగతనం చేస్తే.. వాడ్ని కాపా డేందుకు వేరే వాళ్లు సాక్ష్యాలు తుడిచేయరు. అలా చేస్తే వాడు కూడా సూత్రధారి అన్నమాట. వివేకాకేసులో ఏం జరిగింది.. వివేకా గుండెపోటుతో మృతి అనిప్రచారం చేశారు. నరికేసిన గాయాలు కనబడకుండా కుట్లు వేశారు. రక్తం తుడిచేశారు. పోస్టుమార్టం వద్దన్నారు. కేసు కూడా వద్దన్నారు. అసలు పోలీసులే రావొద్దన్నారు. చివరికి వివేకా కుమార్తె పట్టుబట్టడంతో పోస్టుమార్టం చేశారు. అప్పుడు బయటపడింది. దొరికిపోయిన దొంగలు రాజకీయం చేశారు.
ఆరేళ్లు – ఎందుకు నిందితుల్ని శిక్షించలేకపోయారు?
ఎంత సింపుల్ కేసో కానిస్టేబుల్ గా పదేళ్ల సర్వీస్ ఉన్న వ్యక్తికి తెలుసు. ఎందుకంటే ఈ కేసు ఓ కానిస్టేబుల్ తేల్చేయగలడు. ఆరేళ్లు అయింది. మరి ఎందుకు కేసు సాల్వ్ కాలేదు. వివేకా సొంత అన్న కుమారుడు సీఎం అయ్యారు. పదేళ్లు ఉన్నారు. ఆయనే చంద్రబాబు హత్య చేయించారని ఆరోపించారు. కానీ విచారణ మాత్రం ముందుకు సాగనీయలేదు. చివరికి కోర్టు సీబీఐకి ఇచ్చింది. ఆ సీబీఐపైనా కేసులు పెట్టారు. చివరికి వివేకా కుమార్తెపైనా నిందలేస్తున్నారు. ఇప్పటికీ ఈ కేసు కోర్టుల్లో నీలుగుతోంది. ఆ అన్న కుమారుడి పదవి పోయింది. అయినా మార్పు కనిపించడం లేదు.
బలవంతులు హత్యలు చేసినా తప్పించుకోగలరా ?
అవినీతి కేసుల సంగతి ఎమో కానీ ఇలా మనుషుల్ని అడ్డగోలుగా నరికిన కేసుల్లోనూ వ్యవస్థలు విఫలమైతే సామాన్యులకు భరోసా కష్టమే. నిందితులు ప్రజలు ఇచ్చిన అధికారంతో .. తమను తాము రక్షించుకున్నారు. ప్రజలు ఆ రక్షణ తీసేశారు. ఇప్పుడు అయినా వారికి శిక్ష పడుతుందా.. వివేకా హత్య కేసు నిందితులకు.. సూత్రధారులకు శిక్ష పడితేనే ప్రజలకు చట్టం, న్యాయంపై గౌరవం పెరుగుతుంది. లేకపోతే అరాచకవాదులకు బలం పెరుగుతుంది.