అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘సైజ్ జీరో’ సినిమా గుర్తుందా? బాడీ షేమింగ్ కారణంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సున్నితంగా చర్చించిన అర్థవంతమైన సినిమా. తన పాత్ర కోసం అనుష్క చాలా కష్టపడ్డారు. సుమారు 20 కేజీల వరకూ బరువు పెరిగారు. తరవాత తగ్గడానికి ఇబ్బంది పడ్డారు. మూడేళ్ల క్రితం ఈ సినిమా విడుదలైంది. ప్రశంసలు అయితే వచ్చాయి కానీ… ఆశించిన రీతిలో వసూళ్లు రాలేదు. ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి ‘సైజ్ జీరో’కి దర్శకత్వం వహించారు. ప్రకాష్ సతీమణి, రాఘవేంద్రరావు కోడలు కనికా థిల్లాన్ కథ, మాటలు రాశారు. ఇటీవల విడుదలైన హిందీ సినిమా ‘మన్మర్జియాన్’కి కథ రాసినది ఆమే. అందుకని, ‘సైజ్ జీరో’ హిందీ రీమేక్‌కి వర్క్ చేయమని అడిగారు. కనికా థిల్లాన్ మాత్రం ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. ఒకసారి వర్క్ చేసిన కథపై మళ్లీ వర్క్ చేయడం తనకు ఇష్టం లేదనీ, ప్రేక్షకులకు చెప్పడానికి తన దగ్గర కొత్త కథలు చాలా వున్నాయని కనిక పేర్కొన్నారు. అనుష్క పాత్రలో నటించే హిందీ హీరోయిన్ ఎవరో త్వరలో తెలుస్తుంది.