పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ‘ఖుషి’. ఈ జనరేషన్‌లోనూ ‘ఖుషి’నే తమ ఫేవరెట్ ఫిల్మ్ అని చెప్పినవాళ్లు ఉన్నారు. ఇటీవల ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తే – పవన్ ఫ్యాన్స్ పోటెత్తారు. థియేటర్లని తిరునాళ్లల్లా మార్చేశారు. అకీరా నందన్ తో ‘ఖుషి 2’ తీస్తే బాగుంటుందని అభిమానులు ఆశ పడుతున్నారు. దీనిపై ఎస్.జె.సూర్య కూడా స్పందించాడు.
”అకీరాని రాజమండ్రిలో చూశాను. చాలా బాగున్నాడు. తండ్రిలా పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నాడు. హీరో అయితే తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖుషీ 2 చేయాలని నాకూ వుంది. చూద్దాం.. ఎలా రాసిపెట్టుందో” అని ముక్తాయించాడు సూర్య. అకీరా ఎంట్రీ గురించి రేణూ దేశాయ్ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అకీరా ఎంట్రీ గురించి అందరి కంటే తానే ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, అయితే ఇదంతా అకీరా నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు. అకీరాకు నటనపై ఆసక్తి ఉందా, లేదా? అనేది పెద్ద డిబేట్. తనకు సంగీతంపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని, మ్యూజిక్ కూడా నేర్చుకొన్నాడని ఇది వరకు రేణూ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. కెమెరా ముందుకు రావాలంటే ఇంకొంత సమయం పట్టొచ్చు. మరోవైపు సూర్య కూడా ప్రస్తుతం తన దృష్టి నటనపైనే ఉందంటున్నాడు. నటుడిగా కంఫర్ట్ గా ఉన్నప్పుడు దర్శకత్వం వైపు చూడడం ఎందుకని, మంచి కథ దొరికితే తప్ప ఆ సంగతి ఆలోచించనని చెప్పేశాడు. అకీరా నటనకు రెడీ అయి, ‘ఖుషి 2’ చేద్దామంటే అప్పుడు సూర్యకు ‘నో’ చెప్పే ఛాన్స్ వుండదు.