చిన్న సినిమాల ద్వారా ఎదుగుతున్న నిర్మాత ఎస్.కే.ఎన్. ‘బేబీ’తో ఓ కల్ట్ హిట్ కొట్టాడు. నిర్మాతగానే కాదు, తన ట్వీట్లతో కామెంట్లతో కూడా వార్తలకెక్కడం ఆయనకు అలవాటు. ఓ ట్వీట్ వేస్తే.. అది వైరల్ అవుతుంది. స్టేజ్‌పై కాసేపు మాట్లాడితే అది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది. ఇటీవల ఓ సినిమా వేడుకలో ‘తెలుగమ్మాయిలకు అవకాశం ఇచ్చి తప్పు చేశా.. ఇక ఇవ్వను’ అనే అర్థం వచ్చేట్టు మాట్లాడారాయన. దాంతో ఎస్కేఎన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? అనే టాపిక్ హాట్ హాట్ గా నడిచింది. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి ఎస్కేఎన్ మాట వినడం లేదా? తరవాతి సినిమాలకు డేట్లు ఇవ్వడం లేదా? వైష్ణవితో ఆయన ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నాడా? అనే దిశగా హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. దానికి ఎస్కేఎన్ పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
తాను సినిమా వేడుకలో ఏదో సరదాగా, జోక్‌గా అన్నమాటల్ని సీరియస్ స్టేట్మెంట్లుగా తీసుకోవద్దని, తెలుగు అమ్మాయిలంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని, ఇప్పటి వరకూ దాదాపు 80 శాతం సినిమాలు తను తెలుగు అమ్మాయిలతోనే తీశానని, భవిష్యత్తులో తన సంస్థ నుంచి కనీసం పాతిక మంది అమ్మాయిల్ని వివిధ శాఖల ద్వారా పరిచయం చేద్దామనుకొంటున్నానని చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. తాను ఏయే సినిమాలతో ఏయే తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇచ్చారో సవివరంగా ఆ వీడియోలో ఉదహరించారు. దాంతో.. ఈ మేటర్ కు ఆయన పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నమైతే చేశారు.
ఎస్కేఎన్ వేదికలపై ఎప్పుడూ లైటర్ వేన్లోనే మాట్లాడతారు. కాకపోతే.. తెలుగు అమ్మాయిల గురించి ఆయన ఆ రోజు ఇచ్చిన స్టేట్ మెంట్ ఏదో జోక్ కోసం చెప్పినట్టు అనిపించలేదు. నిజంగానే ఎస్కేఎన్ తెలుగు అమ్మాయిలతో ఏదో ఇబ్బంది ఎదుర్కొంటున్నాడని, ఆ అసహనం ఆయన స్టేట్మెంట్ రూపంలో బయటకు వచ్చిందని అంతా అనుకొన్నారు. దానిపైనే రెండు రోజుల పాటు చర్చ నడిచింది. ఇప్పుడు ఆయన తన మనసులోని ఉద్దేశ్యాన్ని స్పష్టంగా చెబుతూ వీడియోని విడుదల చేయడం.. కాంట్రవర్సీకి పుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఏ వేదికపై మాట్లాడుతున్నాం? సందర్భం ఏమిటి? అనే విషయాలు వక్తలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి తెలుగు అమ్మాయిల గురించి మాట్లాడే వేదిక కాదది. కావాలనే ఎస్కేఎన్ ఈ టాపిక్ తీసుకొచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మనసులో ఉన్న మాటల్ని, ఉద్దేశ్యాల్ని చాలా స్పష్టంగా వ్యక్త పరిచి, చివరికి అది జోక్ అనేస్తే ఎలా? అప్పటికే ఆ స్టేట్మెంట్ చేరాల్సిన గమ్యాలకు చేరిపోయింది కూడానూ.