తెలుగు360 రేటింగ్: 2.5/5
ఇప్పటి ముచ్చట కాదు గానీ… 1979 నాటి మాట. అప్పట్లో స్కై లాబ్ గురించి వింత వింత పుకార్లు ప్రచారంలోకొచ్చాయి. ఆకాశం నుంచి ఓ ఉల్క, ఉపగ్రహ శకలాలు భూమిపై పడబోతున్నట్టు.. ఈ భూమంతా సర్వనాశనం అయిపోతున్నట్టు ప్రచారం సాగింది. అప్పటి జనాన్ని కదిలిస్తే.. దీని గురించి కథలు కథలుగా చెబుతారు. ఏ క్షణాల ఏం జరుగుతుందో అని భయపడిపోయి ముందే.. గుండెపోటుతో చనిపోయిన వాళ్లు కొంతరైతే, ఆ టెన్షన్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నవాళ్లు ఇంకొందరు. ఉన్నదంతా ఖర్చు చేసి జల్సాలు చేసుకున్నవాళ్లు కొందరు, ఏం ఉన్నదో అది అందరికీ పంచి పెట్టి, పుణ్యాత్ములైపోవాలనుకున్నవాళ్లు ఇంకొందరు. మొత్తానికి అదో ప్రహసనం. దాన్నే ఇప్పుడు `స్కైలాబ్` పేరుతో కథగా మార్చారు. ఈ కథ నచ్చి నిత్యమీనన్ కూడా నిర్మాతగా మారింది. ఇంతకీ ఈ స్కైలాబ్ లో ఇంకేమున్నాయి? 1979 నాటి భయాల్ని… సరిగ్గా చూపించారా, లేదా?
హైదరాబాద్ శివార్లలోని బండ లింగంపల్లి అనే ఓ మారుమూల ఊరు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటుంది. అక్కడన్నీ విచిత్రమైన పాత్రలే. ఆ ఊరికే వస్తాడు ఆనంద్ (సత్యదేవ్). తను వృత్తిరీత్యా డాక్టర్. కానీ స్వార్థం ఎక్కువ. కాన్సిల్ అయిన తన డాక్టర్ లైసెన్స్ తిరిగి పొందాలంటే రూ.5 వేలు కావాలి. ఆ 5 వేలు సంపాదించి, తిరిగి టౌనుకి వెళ్టిపోవాలన్నది తన కల. ప్రతిబింబం పత్రికలో పనిచేసే గౌరి (నిత్యమీనన్) తన ఉద్యోగాన్ని పోగొట్టుకుని ఊరొస్తుంది. ఓ మంచి కథ రాయాలని, మళ్లీ ప్రతిబింబంలో తన పేరు చూసుకోవాలన్నది తపన. రామ (రాహుల్ రామకృష్ణ)ది సుబేదార్ల వంశం. తాత ముత్తాతలు మంచి ఆస్తిపరులు. కానీ తన దగ్గరకు వచ్చేసరికి అన్నీ అప్పులే మిగులుతాయి. ఆస్తులన్నీ కోర్టులో ఉంటాయి. ఎప్పటికైనా ఆస్తులు తన చేతికి రాకుండా పోతాయా? అప్పులు తీర్చకపోతానా? చెల్లె పెళ్లి చేయకపోతానా? అన్నది తన తాపత్రయం. సరిగ్గా అలాంటప్పుడే… ఆ ఊర్లో స్కైలాబ్ పడబోతోందని, దాంతో ఊరంతా సర్వనాశనం అయిపోతుందన్న వార్త వస్తుంది. అప్పుడు ఈ ముగ్గురూ ఎలా స్పందించారు? ఆ ఊరి జనాల పరిస్థితేంటి? అనేది మిగిలిన కథ.
స్కై లాబ్ ఉదంతం గురించి తెలిసినవాళ్లకు… ఈ కథ సుపరిచితమే. అప్పటి తరానికి ఓసారి పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే కథ ఇది. ఆ పాయింట్ కి.. మూడు కథల్ని జోడించి.. చావు వస్తుందని తెలియగానే, మనిషి తాలుకూ స్వభావాన్ని, సమాజపు కోణాన్నీ, దృక్పథాన్నీ ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. నిజానికి చక్కటి ఆలోచన. ఓ మంచి సినిమాకి కావల్సిన పునాది కథలో ఉంది. దానికి తోడు మంచి పాత్రలు దొరికాయి. 1979 నాటి పరిస్థితుల్ని, ఆ వాతావరణాన్ని బాగానే ఆవిష్కరించాడు. కథని ప్రారంభించి, పాత్రల్ని పరిచయం చేసే పద్ధతి ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతీ సీన్లోనూ.. కాస్తో కూస్తో వినోదం మేళవించడానికే ప్రయత్నించాడు దర్శకుడు. కాకపోతే.. మరీ పగలబడి నవ్వే సీన్లు కావవి. క్లాస్ కామెడీ.
చిరు మందహాసాలు తప్ప.. విరగబడి నవ్వే సన్నివేశం ఒక్కటీ ఉండదు. స్కై లాబ్ అనేది అసలు కథ అయినప్పుడు మిగిలినవన్నీ సైడ్ ట్రాకులుగా మారాలి. కానీ దర్శకుడు ఏం ఆలోచించాడో, ఎలా ఆలోచించాడో తెలీదు గానీ, స్కై లాబ్ ఓ ట్రాక్ గా మాత్రమే కనిపించింది. మిగిలిన కథలు హైలెట్ అయ్యాయి.
విశ్రాంతి కార్డు దగ్గర మాత్రమే స్కై లాబ్ ప్రస్తావన వస్తుంది. కథకు ప్రాణమైన పాయింట్ ని విశ్రాంతి వరకూ తీసుకురాకపోవడం ప్రధానమైన లోపం. అంత వరకూ తీసిన సన్నివేశాలు కేవలం స్కై లాబ్ కి లీడ్ మాత్రమే. అంటే దర్శకుడు ఎంత కాలయాపన చేశాడో అర్థం అవుతుంది. మరణ భయం పొంచి ఉన్న మనిషి ఎలా మారిపోతాడు? తనలో ఉన్న ఆశ, కర్కశం నాశనమై మంచి తనం ఎలా వెలుగులోకి వస్తుంది? అనే దానిపై ఫోకస్ పెడితే బాగుండేది. డాక్టర్ కథకూ, జర్నలిస్టు కథకూ, సుబేదార్ కథకూ.. ఈ స్కై లాబ్‌కీ సంబంధమే ఉండదు. స్కై లాబ్ అనే ఉదంతం ఉన్నా లేకున్నా వాళ్ల కథలు అంతే. ఈ స్కై లాబ్ వల్ల వాళ్లలో వచ్చిన మార్పులేం కనిపించవు. గౌరి కల నెరవేరడం తప్ప.. వాళ్ల జీవితాలేం మారిపోవు. రూ.5 వేలు సంపాదిస్తే చాలు అనుకునే ఆనంద్ లో మార్పు ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? అనే పాయింట్ ని మనసుకి హత్తుకునేలా చూపించలేకపోయాడు దర్శకుడు. గుడిలో అడుగుపెట్టలేని జీవితాలు, వర్గాలు.. చివర్లో గుడిలో రాముడి విగ్రహం చూసి తన్మయత్వం పొందుతాయి. కాకపోతే.. ఆ గుడిలోకి వెళ్లడానికి చేసే పోరాటమో, గుడి మెట్ల ముందు ఆగిపోయిన వాళ్ల బాధో.. ఆవిష్కరిస్తే – క్లైమాక్స్ సీన్‌కి ఓ హై వచ్చి ఉండేది. అదేం లేకపోయే సరికి.. ఆ సీన్ కూడా మామూలు సీన్ గానే మిగిలిపోతుంది.
సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, నిత్యమీనన్.. ఈ ముగ్గురూ తమ తమ పాత్రల్ని భుజాలపై వేసుకుని నడిపించేశారు.చాలా సన్నివేశాలు కేవలం ఈ ముగ్గురి వల్ల ఎలివేట్ అయ్యాయి. సత్యదేవ్ కొత్త తరహా పాత్రలవైపు ఎక్కువగా ప్రభావితం అవుతాడు. తన వరకూ.. ఇది మరో మంచి పాత్ర. రాహుల్ రామకృష్ణలో చాలామంది కమిడియన్నేచూశారు.కానీ.. అది దాటొచ్చి చాలా సెటిల్డ్ నటన ప్రదర్శించగలడు. ఈ సినిమాతో అది మళ్లీ నిరూపితమైంది. నిత్య చాలా కాలం తరవాత చూడముద్దొచ్చేలా కనిపించింది. తనకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. భరణి లాంటి అనుభవం ఉన్న నటుడి గురించి ఏమని చెప్పుకోవాలి? అందరూ తమ శక్తిమేర నటించారు.
దర్శకుడి ఆలోచన మంచిది. అది ఆకాశంలో ఉంది. కానీ.. తీత అంత జనరంజకంగా లేదు. బోరింగ్సీన్లు.. కథలోకి త్వరగా వెళ్లకపోవడం, ఎంతసేపూ పాత్ర చిత్రణపైనే దృష్టి పెట్టడంతో అసలు విషయం మరుగున పడిపోయింది. సంభాషణలు బాగున్నాయి. సున్నిశితమైన హాస్యం దొర్లింది. ఆర్ట్ వర్క్ బాగుంది. నేపథ్య సంగీతం కూల్ గా ఉంది. ఒకట్రెండు పాటలున్నాయి కానీ, గుర్తు పెట్టుకునే లేవు.
స్కై లాబ్ చూస్తే.. మన వాళ్లు బాగానే ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది.కానీ… ఆలోచనని జనరంజకంగా మలిచే విషయంలో కాస్త తడబడుతున్నారు. ఇప్పుడు కూడా మించిపోయిందేం లేదు. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు.. చి ఆలోచనలు.. మంచి సినిమాలుగా రూపాంతరం చెందుతాయి. అప్పటి వరకూ ఎదురు చూద్దాం.
ఫినిషింగ్ టచ్: స్కైలాబ్ – ప(0)డలేదు
తెలుగు360 రేటింగ్: 2.5/5