చిన్న సినిమా నిలదొక్కుకోవాలంటే… ఈ రోజుల్లో అద్భుతాలే జరగాలి. కంటెంట్ తో కూర్చోబెట్టాలి. కామెడీ సినిమా అయితే నాన్ స్టాప్‌గా నవ్వించాలి. లవ్ స్టోరీ అయితే ఎమోషన్స్ తో మెప్పించాలి. అరకొర ప్రయత్నాలతో విజయాలు సాధించలేరు. కొన్ని చిన్న సినిమాలు కేవలం పాయింట్ల దగ్గరే ఆగిపోతున్నాయి. ఓ మంచి పాయింట్ అయితే పట్టుకొంటున్నారు కానీ – థియేటర్లో రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని కూర్చోబెట్టేలా మ్యాజిక్ మాత్రం చేయలేకపోతున్నాయి. అందుకు మరో ఉదాహరణగా నిలిచే చిత్రం… `స్లమ్ డాగ్ హజ్బెండ్`.
ఓ కుక్కని పెళ్లి చేసుకొన్న అబ్బాయి తిప్పలు ఈ కథ. ఈ సినిమాలోని కోర్ పాయింట్ ఏమిటో టీజర్, ట్రైలర్లోనే చెప్పేశారు మేకర్స్. దాన్ని రెండు గంటల పాటు సాగదీశారంతే! లక్ష్మణ్ (సంజయ్ రావు) పార్శీ గుట్ట కుర్రాడు. రోడ్లపై కళ్లద్దాలు అమ్ముకొంటూ జీవనం సాగిస్తుంటాడు. మౌనిక (ప్రణవి) అంటే చాలా ఇష్టం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకొంటారు. పెద్దల్నీ ఒప్పిస్తారు. అయితే ఇక్కడే చిక్కు వస్తుంది. పెళ్లికి జాతకాలు కావాలి కదా? లక్ష్మణ్, మౌనిక.. ఇద్దరి జాతకాలూ వాళ్ల తల్లిదండ్రులకు తెలీవు. దాంతో.. దోష నివారణ కోసం ముందు ఓ కుక్కకి పెళ్లి చేసుకోమని సూచిస్తాడు పురోహితుడు. దాంతో ఇష్టం లేకపోయినా బేబీ అనే కుక్క మెళ్లో మూడు ముళ్లూ వేస్తాడు లక్ష్మణ్. ఆ తరవాత.. మౌనికని పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. కానీ.. తన ప్లాన్ ఘోరంగా అట్టర్ ప్లాప్ అవుతుంది. అదెలా? కుక్కతో పెళ్లి చేసుకోవడం వల్ల లక్ష్మణ్ ఎన్ని తిప్పలు పడ్డాడు? ఇది మిగిలిన కథ.
తెరపై ఏం చూపించబోతున్నారన్న విషయం ట్రైలర్లోనే చెప్పేసింది చిత్రబృందం. 2 గంటల సినిమాలోనూ అదే వ్యవహారం. లక్ష్మణ్ జైలులో అలీకి తన కథ చెప్పుకోవడంతో సినిమా మొదవుతుంది. ఆరంభంలో యూత్‌ని మెప్పించడానికి కొన్ని సీన్లు రాసుకొన్నారు. లక్ష్మణ్, మౌనికలు పెళ్లి చేసుకోవడం కోసం ఎంత ఉబలాట పడుతున్నారో.. ఆ సీన్లు చూస్తే అర్థమవుతుంది. వారిద్దరూ శారీరక సుఖం కోసమే పెళ్లి చేసుకోవాలనుకొంటున్నారా? అనే ఫీలింగ్ థియేటర్లో ప్రేక్షకులకు కలుగుతుంది. పురోహితుడు జాతకాలు చూడడం, కుక్కని పెళ్లి చేసుకోమని సలహా ఇవ్వడంతో… అసలు కథ మొదలవుతుంది. ఆ తరవాత ప్రతీ సన్నివేశం ఊహకు అందుతూనే ఉంటుంది.
తెరపై నటీనటులు కామెడీ చేస్తున్నామని ఫీలవుతుంటారు కానీ, థియేటర్లో ప్రేక్షకులకు నవ్వురాదు. కుక్కకు వెన్నెల కిషోర్ తన గొంతు అరువివ్వడం వల్ల, వెన్నెల కిషోర్ టైమింగ్ వల్ల కొన్ని డైలాగులు పండాయి. సెకండాఫ్‌లో కోర్టు రూమ్ డ్రామా మొదలవుతుంది. జడ్జ్ గా ఫిష్ వెంకట్ ని కూర్చోబెట్టగానే, కోర్టు రూమ్ డ్రామా నుంచి కూడా కామెడీ పండించాలని దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు అనే సంగతి అర్థం అవుతుంది. కానీ కనీసం ఇక్కడైనా వినోదం పుట్టలేదు. సప్తగిరి, బ్రహ్మాజీ ఇద్దరి వాదనలూ సిల్లీగా సాగుతాయి. కుక్కకి విడాకులు, భరణం అడగడం ఇవన్నీ తేలిపోయే వ్యవహారాలు. ఈ పాయింట్ తో జనాన్ని కూర్చోబెట్టాలంటే సన్నివేశాలు సరదాగా రాసుకోవాలి. కానీ.. దర్శకుడు, రచయిత ఈ విషయంలో తేలిపోయారు. `పేదవాళ్లకు న్యాయం దొరకదా సార్` అంటూ బోనులో హీరో గంభీరంగా డైలాగులు పలుకుతాడు కానీ, ఆఖరికి ఆ ఎమోషన్ కూడా వర్కవుట్ అవ్వదు. మూగ జీవాలు, వాటి రక్షణ, పరిరక్షణ, హక్కుల గురించి కూడా దర్శకుడు ఏదో చెబుదామనుకొన్నాడు. కానీ.. ఆ ప్రయత్నం కూడా సగం సగమే. ఇలా అరకొర వ్యవహారాలతో.. ఈ హజ్బెండ్ అనుక్షణం బోర్ కొడుతూ సాగుతుంది. చివర్లో పెద్ద ట్విస్టు అనుకొని… ఓ కమెడియన్ ని విలన్ చేసేశారు. అది కూడా వర్కవుట్ అవ్వలేదు. అదీ కావాలని ఇరికించిన ట్విస్టులానే అనిపిస్తుంది.
ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు లేవా? అంటే ఉన్నాయి. `లచ్చి గాడి పెళ్లి` పాట బారాత్‌లకు పర్ఫెక్టు సూటు అవుతుంది. ఆ పాట ఆద్యంతం హుషారుగా సాగిపోయింది. వింటేజ్ లుక్ తో ఓ పాట రూపొందించారు. అది కూడా బాగానే సెట్టయ్యింది. హీరోయిన్ కాస్త అందంగా ఉంది. తెలుగమ్మాయి కాబట్టి ఇంకాస్త నచ్చుతుంది. తన తొలి సినిమా పిట్టకథతో పోలిస్తే సంజయ్ రావు నటన కాస్త మెరుగు పడింది. మధ్యతరగతి జీవితాలు, వాళ్ల విన్యాసాల్ని తెరపై కాసేపు చూసుకొనే అవకాశం దక్కింది. చిన్న సినిమా అయినా క్వాలిటీగా తీశారు.
పాయింట్ లో దమ్ముంది. ఇలాంటి చిన్న చిన్న పాయింట్లతోనే బాలీవుడ్ దర్శకులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. వినోదం పండగించడానికి కావల్సినంత అవకాశం ఈ కథలో ఉంది. అయితే… దర్శకుడు, రచయిత దాన్ని సరిగా వాడుకోలేకపోయారు. మొత్తానికి స్లమ్ డాగ్.. కాస్త నిరాశ పరిచింది.