అన్నం ఉడికిందో లేదో చూడ్డానికి ఒక్క మెతుకు చాలు. సినిమా బాగుంటుందో, లేదో చెప్పడానికి టీజర్ సరిపోతుంది. పెద్ద సినిమాల విషయంలో టీజర్ ఎలా ఉన్నా – సినిమాకొచ్చే ఓపెనింగ్స్‌లో తేడా ఉండదు. చిన్న సినిమాలకు మాత్రమే టీజరే వరం. దాంతోనే ఆకర్షించాలి. ఆకట్టుకోవాలి. ఈమధ్య కొన్ని సినిమాలు టీజర్, ట్రైలర్లతో ఆసక్తిని పెంచేస్తున్నాయి. సినిమాలో విషయం ఉందన్న హింట్ ఇస్తున్నాయి. ప్రేక్షకులతో పాటు, వ్యాపార వర్గాలు కూడా ఆయా సినిమాలపై ఫోకస్ పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో బాక్సాఫీసు దగ్గరకు మంచి సినిమాలు వస్తున్నాయన్న భరోసా కలిగిస్తున్నాయి.
ఈమధ్య విడుదలైన టీజర్లలో కల్కి, బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, దొరసాని, రాజ్ దూత్ ప్రచార చిత్రాలు – రాబోయే హిట్ చిత్రాలపై భరోసా కలిగిస్తున్నాయి. కల్కి టీజర్‌తోనే… రాజశేఖర్ సినిమా బిజినెస్ మొదలైపోయింది. అలా రాజశేఖర్ సినిమాకి విడుదలకు ముందే వ్యాపారం జరగడం – చాలా ఏళ్ల తరవాత ఇదే ప్రధమం. శ్రీహరి తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న రాజ్‌దూత్‌పై కూడా అన్నో ఇన్నో ఆశలున్నాయి. టీజర్‌లోని డైలాగులతో అవి కాస్త పెరిగాయి. ఆ దమ్ము.. సినిమాలోనూ ఉంటే – రియల్ స్టార్ వారసుడికి ఓ ఫ్లాట్ ఫామ్ దొరికేసినట్టే. విజయ్ దేవరకొండ సోదరుడు చేస్తున్న `దొరసాని` టీజర్ కూడా డిఫరెంట్‌గా ఉంది. రాజు – పేద ప్రేమ కథే అయినా నేపథ్యం మారడం, తెలంగాణ యాస ఇవన్నీ ఓ కొత్త లుక్‌ని తీసుకొచ్చాయి. చంటబ్బాయ్‌కి రీమేల్లా కనిపిస్తున్న `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` లో కూడా విషయం ఉందని టీజర్, ట్రైలర్లు చెప్పకనే చెబుతున్నాయి. ఇక శ్రీవిష్ణు మరోసారి తన వైవిధ్యాన్ని చాటుకుంటూ ఎంచుకున్న కథ `బ్రోచేవారెవరురా`. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మంచి విడుదల తేదీ కోసం చిత్రబృందం ఎదురుచూస్తోంది.
మొత్తానికి చిన్న సినిమాలు వెరైటీ నేపథ్యాలు, కాన్సెప్టులతో బాక్సాఫీసు రేసులో నిలిచాయి. టీజర్లో ఉన్న దమ్ము.. సినిమాలో కనిపిస్తుందా? లేదా? దర్శకుల టాలెంట్ మొత్తం ఇలా టీజర్లకే పరిమితమా? దానికి మంచి ఏమైనా ఉందా? అనే విషయం ఈ సినిమాలు విడుదలైతే గానీ తెలీదు.