చిన్న సినిమాల పరిస్థితి, ముఖ్యంగా కొత్తవాళ్లతో రూపొందించిన సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. థియేటర్లు ఫిల్ కావడం లేదు. కనీసం 20 శాతం ఆక్యుపెన్సీ కూడా ఉండడం లేదు. గతవారం ఓ చిన్న సినిమా వచ్చింది. రిలీజ్ రోజు థియేటర్ వెళ్తే.. కనీసం పది మంది కూడా లేని పరిస్థితి. షోలు కూడా కాన్సిల్ చేయాల్సిన దుస్థితి. ఓ టీవీ స్టార్, తన కొడుకును హీరోగా ప్రమోట్ చేయడానికి దాదాపు రూ.5 కోట్లతో ఓ సినిమా తీస్తే, థియేటర్ రెంట్లు కూడా ఎదురు కట్టాల్సివచ్చింది. ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.
చిన్న సినిమాలకు మౌత్ పబ్లిసిటీ చాలా అవసరం. దాన్ని ఎలా రాబట్టుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. విడుదలకు ముందే ప్రీమియర్ల పేరుతో జనాలకు సినిమాని ముందే చూపిస్తున్నారు. ఇది నిజంగా రిస్క్ తో కూడిన వ్యవహారం. సినిమా బాగుంటే ఓకే. లేదంటే.. విడుదలకు ముందే నెగిటీవ్ రిపోర్టులు వినాల్సివస్తుంది. అయినా సరే, రిస్క్ చేస్తున్నారు నిర్మాతలు. ‘పొట్టేల్’, ‘లగ్గం’ ఈవారం విడుదల అవుతున్న సినిమాలు. రెండు రోజులకు ముందే ఈ రెండు సినిమాల ప్రీమియర్లు ప్రదర్శించారు. ‘లగ్గం’ అయితే షోల మీద షోలు వేస్తూనే ఉన్నారు. బుధవారం మీడియా కోసం ఓ షో వేశారు. గురువారం హైదరాబాద్ లో మహిళల కోసం ఉచితంగా ఈ సినిమాని ప్రదర్శిస్తున్నారు. ఇదంతా కేవలం మౌత్ పబ్లిసిటీ కోసమే. కోట్లలో పెట్టి తీసిన సినిమా రిలీజ్ కు ముందే ఫ్రీగా చూపించడం ఓ మొండి ధైర్యం. దానికీ వెనుకంజ వేయడం లేదు నిర్మాతలు. చిన్న సినిమాలనే కాదు, మీడియం రేంజ్ సినిమాలూ ఇదే దారిలో వెళ్తున్నాయి. స్టార్ లేకపోతే… థియేటర్లకు జనం రాని పరిస్థితి. అలాంటప్పుడు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి ఏదో కొత్తగా ప్రయత్నం చేయాల్సిందే.