బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేయించి అనేక వందల మంది ఆర్థికంగా కుంగిపోవడానికి కారణం అవుతున్నారని పలువురు చిన్న స్థాయి సెలబ్రిటీలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారు. అయితే వీరు చేసిన నేరం ఏమిటంటే ఇల్లీగల్ యాప్స్ కు ప్రమోషన్ చేయడమే. కానీ అసలు ఆ ఇల్లీగల్ యాప్స్ ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు..వాటిని ఎవరు నడిపిస్తున్నారో ఎందుకు తెలుసుకోవడం లేదు..? వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదు?
బెట్టింగ్ మాఫియా మూలాలు ఎక్కడ?
బెట్టింగ్ అనేది అతి పెద్ద జాడ్యం. ఎదురుగా బెట్టింగ్ చేస్తేనే మోసం చేస్తారు. ఇక టెక్నికల్ గా అన్నీ వారి చేతుల్లో ఉంటే మోసం చేయకుండా ఉంటారా?. బెట్టింగ్ అనేది వంద శాతం మోసం. మొదట కొంత మందికి కాస్తంత డబ్బులు వచ్చేలా చేసినా ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఎలా అంటే ఇల్లు, ఒళ్లు గుల్ల చేసేలా చేస్తారు. చివరికి ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదన్నట్లుగా చేస్తారు. ఇలాంటి మాఫియా అత్యంత ప్రమాదకరం. ఆ మాఫియా మూలాలను పట్టుకోవాలి కానీ.. వాటిని ప్రమోట్ చేశారని చిన్న చిన్న వ్యక్తులపై కేసులు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు.
ప్రమోట్ చేయడం తప్పే కానీ వారినే నిందితులుగా చూపడం కరెక్టేనా?
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం తప్ప. అది ఏ స్థాయి నేరమో చేసిన వారికీ అవగాహన ఉండదు. ఎందుకంటే కొత్తగా చేయడం లేదు. చాలా కాలం నుంచి చేస్తున్నారు. యూట్యూబర్లు తమ వీడియోల మధ్యలో వీటిని ప్రమోట్ చేస్తున్నారు. వీరికి డబ్బులు వస్తాయి కాబట్టి చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు.. ఎవరినీ ఏమీ అనట్లేదు కాబట్టి తాము కూడా చేస్తున్నామని ఇతరులు అనుకుంటారు. ఇదంతా అవగాహన లేకపోవడమే. నేరం అని తెలిస్తే చేసి ఉండేవారు కాదు. హఠాత్తుగా ఇప్పుడు అది నేరం అని కేసులు పెడతామని బెదిరించడం.. సమంజసం కాదన్న వాదన వినిపిస్తోంది.
అసలు కింగ్ పిన్లను పట్టుకోవాలి !
బెట్టింగ్ యాప్స్ ను లోకల్ సెలబ్రిటీలతో ఇంత ఎక్కువగా ప్రమోట్ చేయించారంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా కింగ్ పిన్స్ ఉన్నారని అర్థం అవుతుంది. వారిని పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. అలాంటి పనులు చేయకుండా సజ్జనార్ అనే పోలీసు అధికారి.. చోటా సెలబ్రిటీలను.. టీవీ నటులను టార్గెట్ చేసి ..కేసులు పెట్టాలి అంటే.. పెట్టేస్తున్నారు. అసలు ఆ యాప్స్ క్రియేటర్లను పట్టుకోవాలని ఆ సజ్జనార్ అయినా ఎందుకు చెప్పరో కానీ.. నేరం మూలాల్ని పెకిలించినప్పుడే ఆ నేరం ఆగుతుంది. లేకపోతే పెరుగుతూనే ఉంటుంది.