రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా విజయవంతం అవడం, దానికి జాతీయ ఉత్తమ చిత్ర అవార్డు అందుకోవడం గురించి అందరికీ తెలుసు కానీ బాహుబలిని అత్యంత ఇష్టపడే, అత్యంత విశ్వాసపాత్రుడయిన కట్టప్ప అతనిని రక్షించవలసిందిపోయి ఎందుకు చంపవలసి వచ్చిందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. బాహుబలిని తనే చంపినట్లు కట్టప్ప చెప్పుకొన్నప్పటికీ, బల్లాలదేవుడి చెరలో ఉన్న రాణి దేవసేన పట్ల అత్యంత విధేయంగా వ్యవహరిస్తూ, ఆమె తప్పించుకుపోవడానికి సహాయపడతానని చెప్పడం వలన కట్టప్ప విధేయతపై ఎవరికీ అనుమానం కలుగలేదు. అయినా బాహుబలిని తనే చంపినట్లు చెప్పుకోవడంతో ప్రేక్షకులు అయోమయం చెందారు.
ఒక టీవీ ఇంటర్వ్యూలో “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?” అని ఆ సినిమా దర్శకుడు రాజమౌళినే నేరుగా అడిగితే ‘నేను చంపమన్నాను గాబట్టి చంపాడు’ అని చిలిపిగా సమాధానం చెప్పారే తప్ప ఎందుకు చంపాడో చెప్పలేదు. బాహుబలి రెండవ భాగం చూసేందుకు ప్రేక్షకులను ధియేటర్ల వద్దకు రప్పించడానికి తద్వారా సినిమా విజయానికి ఆ మాత్రం సస్పెన్స్ మెయింటెయిన్ చేయడం చాలా ఆసరమే కనుక ఎవరూ దానిపై లోతుగా పరిశోధన చేసి కనుగొనే ప్రయత్నం చేయలేదు. కనుక ఆ సస్పెన్స్ ఏమిటో తెలుసుకోవాలంటే ఏప్రిల్ 14వ తేదీన బాహుబలి రెండవ భాగం విడుదలయ్యేవరకు వేచి చూడవలసిందే.
అయితే ఈలోగానే ఆ సస్పెన్స్ గురించి బాహుబలికి కధ అందించిన విజయేంద్ర ప్రసాద్ వర్మ ఒక ఆసక్తికరమయిన విషయం చెప్పారు. ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేఖరి ఆయనని ఇదే ప్రశ్న అడిగినప్పుడు, “బాహుబలి చనిపోయాడని మీరు ఎందుకు భావిస్తున్నారు?” అని ఎదురు ప్రశ్నవేశారు. ఆ విషయంలో అంతకుమించి ఆయన వివరణ ఇవ్వలేదు. కానీ ఆయన వేసిన ఎదురుప్రశ్నతో కట్టప్ప చేతిలో బాహుబలి చనిపోలేదని సూచిస్తున్నట్లుంది.
మన పాత జానపద సినిమాల ఫార్ములాను బాహుబలికి అప్లై చేసి చూసినట్లయితే, బాహుబలిని చంపి సింహాసనం అధిష్టించడానికి బిజ్జులదేవుడు, బల్లాలదేవుడు కుట్రలు పన్నుతున్నారు కనుక బాహుబలిని అడ్డు తొలగించుకొనేందుకు వారిరువురూ కట్టప్పని బ్లాక్ మెయిల్ చేసి ఉండవచ్చును. బాహుబలిని హత్య చేయకపోతే శివగామిని, దేవసేన, శివుడు అందరినీ నిర్దాక్షిణ్యంగా చంపేస్తామని వారు కట్టప్పని బెదిరించి ఉండవచ్చును. వారిననందరినీ కాపాడుకోనేందుకే కట్టప్ప బాహుబలిని చంపినట్లు నటించి, ఆ తరువాత తన అనుచరుల సహాయంతో అతనిని ఎక్కడో రహస్య ప్రదేశంలో దాచి ఉండవచ్చును. తద్వారా రాజకుటుంబీకులు అందరినీ రక్షించుకొన్నట్లు అవుతుంది. విజయేంద్ర ప్రసాద్ వర్మ ఇచ్చిన ఈ చిన్న క్లూని బట్టి చూస్తే ఇదే జరిగి ఉండవచ్చును. కానీ ఇంకా వేరే విధంగా కూడా జరిగి ఉండవచ్చును.
ఈ సినిమాలో బాహుబలి, శివగామిని, బిజ్జులదేవుడు, బల్లాలదేవుడు, కట్టప్ప పాత్రలను రామాయణ మహాభారతాలలో రాముడు, అర్జునుడు, కైకేయి, కుంతి, గాంధారి, శకుని, రావణుడు, దుర్యోధనుడు పాత్రల ప్రేరణగా రూపొందించినట్లు విజయేంద్ర ప్రసాద్ వర్మ తెలిపారు. ఆ విషయం సినిమాలో లీలగా కనబడుతూనే ఉంది. దానిని అయన నిజాయితీగా చెప్పుకోవడమే అయన గొప్పదనం.