ఈమధ్య భారీ చిత్రాల పేరు వినగానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గుర్తొస్తోంది. ప్రభాస్, పవన్, రవితేజ లాంటి స్టార్లతో వరుసపెట్ట సినిమాలు తీస్తున్నారు. ఈ కమర్షియల్ సినిమాల పరంపరలో ఓ చిన్న ఎక్స్పెర్మెంట్ కూడా చేసింది పీపుల్ మీడియా. వెటరన్ జంట రాజేంద్ర ప్రసాద్, జయప్రదలతో ఓ సినిమా తీసింది. దీనికి ‘లవ్@60’ అనే పెరు పెట్టారు. వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహించారు. షూటింగ్ కూడా పూర్తయ్యింది. రేపు.. ఈ సినిమా పేరునీ, ఇతర వివరాల్ని అధికారికంగా ప్రకటిస్తారు. మార్చిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిజానికి ఓటీటీ కోసం చేసిన సినిమా ఇది. అయితే ఇప్పుడు థియేటర్లలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. అరవై ఏళ్ల ఓ జంట మళ్లీ ఎలా ప్రేమలో పడింది? అనే పాయింట్ ని ఓ సోషల్ మెసేజ్ మిక్స్ చేసి ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారు. రాజేంద్ర ప్రసాద్ అంటే.. ఎవర్ గ్రీన్ హాస్యం. జయప్రదని ఫుల్ లెంగ్త్ రోల్ లో చూసి చాలా కాలం అయ్యింది. కాబట్టి.. కాంబినేషన్ పరంగా ఈ సినిమా క్రేజ్ సంపాదించుకొన్నట్టే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న సినిమా కాబట్టి.. ప్రమోషన్లు కూడా బాగానే చేస్తారు. ఇన్ని పెద్ద సినిమాల మధ్య ఈ చిన్న సినిమాకు ఈ సంస్థ ఎలాంటి క్రేజ్ తీసుకొస్తుందో చూడాలి.