మహర్షి తరవాత బ్లాక్‌బ్లస్టర్ హిట్లేం పడలేదు. కాకపోతే… అప్పుడప్పుడూ అడపా దడపా చిన్న సినిమాలు మెరిశాయి. ఎలాంటి హడావుడీ లేకుండా విడుదలైన చిన్న సినిమాలే కాస్త మంచి ఫలితాల్ని సాధించాయి. ఆ బడ్జెట్‌కి, చేసిన ప్రచారానికి మించి మంచి విజయాలనే అందుకున్నాయి.
విశ్వక్ సేన్ దర్శకత్వం వహించిన ‘ఫలక్‌నుమా దాస్’ మాస్‌ని ఆకట్టుకోవడంలో విజయవంతమైంది. బీ, సీలలో ఈ సినిమాకి మంచి వసూళ్లు అందాయి. విడుదలకు ముందు, ఆ తరవాత ఏర్పడిన పరిణామాలు, వివాదాల వల్ల ఈ సినిమా పబ్లిసిటీకి ప్లస్ అయ్యింది. ఫలక్‌నుమా దాసుని హిట్టు సినిమాల కింద చేర్చలేం గానీ, బడ్జెట్‌ని తిరిగి రాబట్టుకుని – సేఫ్ జోన్లో పడిపోయింది.
చింతమనేని మల్లేశం జీవిత కథగా తెరకెక్కిన ‘మల్లేశం’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నిజాయతీతో చేసిన ప్రయత్నంగా విశ్లేషకులు ఈ చిత్రాన్ని అభినందించారు. కోటి రూపాయల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఆ డబ్బుల్ని రాబట్టుకుంది కూడా. నటీనటులు, సాంకేతిక నిపుణులకు మంచి మార్కులు పడ్డాయి. ఆర్థిక విజయాన్ని పక్కన పెట్టి చూస్తే – వాళ్ల జీవితాల్లో `మల్లేశం` చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
తెలుగులో గూఢాచారి చిత్రాలు లేవన్న లోటుని తీర్చేసింది ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ఎలాంటి అంచనాలూ లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర హిట్ అనిపించుకుంది. తక్కువ బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం… దానికి మించిన వసూళ్లతో లాభాల బాట పట్టింది. నవీన్ పొలిశెట్టికి కథానాయకుడిగా ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. దర్శకుడుపై కూడా కర్చీఫ్‌లు పడుతున్నాయి. బడా దర్శకులు, హీరోలు కూడా ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ…. ఫ్రీ పబ్లిసిటీని తీసుకొచ్చారు. ఇంతకంటే ఏం కావాలి?
శ్రీవిష్ణు సినిమా `బ్రోచేవారెవరురా` కూడా హిట్ అనిపించుకుంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్లలో మంచి ప్రయత్నంగా నిలిచింది. వివేక్ ఆత్రేయ స్క్రీన్ ప్లేకి మంచి మార్కులు పడుతున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషికి ఈ చిత్రం అద్దం పట్టింది. బాక్సాఫీసు దగ్గర కూడా మంచి వసూళ్లు అందుకుంటోంది. మొత్తానికి గత కొంతకాలంగా చిన్న సినిమాలే టాలీవుడ్‌కి పెద్ద దిక్కుగా నిలుస్తున్నాయి. ఇదీ ఒకందుకు మంచిదే. ఓ పెద్ద సినిమా హిట్టయితే ఆ సినిమా నిర్మాత, పంపిణీదారులే లాభ పడతారు. చిన్న సినిమా అలా కాదు. ఓ చిన్న సినిమా హిట్టయితే..అలాంటి పది ప్రయత్నాలు పురుడు పోసుకుంటాయి. కొత్త నిర్మాతలు కొత్త దర్శకులు వస్తారు. చిత్ర సీమకు ఇప్పుడు అదే కావాలి.