జనవరి బాక్సాఫీసు ఆశావాహంగానే సాగింది. ఫిబ్రవరిలో ‘తండేల్’ లాంటి హిట్ పడింది. మరో రెండు వారాలు మిగిలే ఉన్నాయి. ఈ రెండు వారాల్లోనూ ఆసక్తికరమైన సినిమాలే వస్తున్నాయి. గత వారం విడుదలైన ‘లైలా’ బాగా నిరాశ పరిచింది. ఈవారం ఓ నాలుగు చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. నాలుగూ భిన్నమైన కథలే. రెండు కథలు వినోదాత్మక చిత్రాలైతే, మరో రెండు ‘నాన్న’ అనే ఎలిమెంట్ చుట్టూ తిరిగే కథలు.
‘లవ్ టుడే’తో ఆకట్టుకొన్న హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ సినిమా తెలుగులోనూ బాగా ఆడింది. ప్రదీప్ లో ధనుష్ లుక్స్ కనిపించాయి. దాంతో… ఈజీగా ఆ పాత్రని ఓన్ చేసుకోగలిగారు తెలుగు అభిమానులు. ఇప్పుడు ప్రదీప్ నుంచి ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అనే ఓ సినిమా వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ట్రైలర్ లో యూత్ ఫుల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. అనుపమ ఉంది కాబట్టి తెలుగు వరకూ అదో ప్లస్ పాయింట్.
ధనుష్ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. ఇది కూడా హాస్యభరిత చిత్రమే. పవీష్, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. ప్రియా వారియర్‌కి తెలుగులోనూ అభిమానులున్నారు. పైగా ఇది తెలుగు సినిమా. టైటిల్ కూడా క్యాచీగా ఉంది. టీజర్, ట్రైలర్ ఓకే అనిపించాయి. దాంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాపై ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి.
బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘బాపూ’. అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా పారితోషికం తీసుకోకుండా చేశానంటూ… బ్రహ్మాజీ మంచి బూస్టప్ ఇచ్చారు. తను ప్రమోషన్లలో బాగా పాలు పంచుకొంటున్నారు. ట్రైలర్లో ‘బలగం’ ఛాయలు కనిపించాయి. ఓ తండ్రి ఎమోషన్ చుట్టూ సాగే కథ ఇది. వినోదానికి పెద్ద పీట వేశారు.
కమెడియన్ ధన్‌రాజ్ దర్శకత్వం వహించిన ‘రామం రాఘవం’ కూడా ఈవారమే విడుదల అవుతోంది. సముద్రఖని, ధన్‌రాజ్ తండ్రీ కొడుకులుగా నటించారు. తండ్రంటే ఏమాత్రం ప్రేమ, గౌవరం లేని కొడుకు కథ ఇది. వారిద్దరి మధ్య సాగే డ్రామానే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ‘బలగం’తో వేణు దర్శకుడిగా తన ముద్ర వేసుకొన్నాడు. ఈసారి ధన్‌రాజ్ ఏం చేస్తాడన్నది ఆసక్తిగా మారింది.