ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడంలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. రామానాయుడు ఉన్నప్పుడు.. ఆయన చిన్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. సురేష్ బాబు వచ్చాక కేవలం పెద్ద సినిమాలపై ఫోకస్ పడింది. చిన్న సినిమాల్లో మంచివి ఎంచుకుని, తమ సంస్థ ద్వారా విడుదల చేశారు తప్ప, చిన్న సినిమాల నిర్మాణంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈసారి మాత్రం సురేష్ ప్రొడక్షన్స్ నుంచి రెండు చిన్న సినిమాలు రానున్నాయి. ఈ రెండు సినిమాలూ… రామానాయుడు ఫిల్మ్ స్కూల్ నుంచి దర్శకత్వ పట్టా పొందిన వాళ్లకే అప్పగించారు. ఓ చిత్రానికి సతీష్ త్రిపుర, మరో సినిమాకి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులలో ఎక్కువ భాగం.. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో శిక్షణ పొందినవాళ్లనే తీసుకుంటారు. అటు ఫిల్మ్ స్కూల్ ప్రమోషన్లకు ఉపయోగపడుతూనే, ఇటు చిన్న సినిమాలు తీశామన్న తృప్తి మిగులుతుంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాల్ని సురేష్ ప్రొడక్షన్స్ త్వరలో వెల్లడించబోతోంది.