ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంత గ్రామాలన్నీ మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. ఇప్పటి వరకూ చాలా గ్రామాలు పంచాయతీలుగానే ఉన్నాయి. అయితే హైదరాబాద్ పూర్తిగా నగరంగా మార్చేందుకు.. మొత్తం మిగిలి ఉన్న గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాలు విలీన జాబితాలో ఉన్నాయి.
పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో.. బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్ తారామతిపేట పంచాయతీలు , శంషాబాద్ మున్సిపాలిటీలో.. బహదూర్‌గూడ, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్ గూడ, ఘంసీమిగూడ , నార్సింగి మున్సిపాలిటీలో.. మీర్జాగూడ గ్రామపంచాయతీ, తుక్కుగూడ మున్సిపాలిటీలో.. హర్షగూడ గ్రామపంచాయతీ, మేడ్చల్ మున్సిపాలిటీలో.. పూడూరు, రాయిలాపూర్ గ్రామపంచాయతీలు, దమ్మాయిగూడ మున్సిపాలిటీలో.. కీసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి, నాగారం మున్సిపాలిటీలో.. బోగారం, గోదాముకుంట, కరీంగూడ, రాంపల్లి దాయార గ్రామాలు, – పోచారం మున్సిపాలిటీలో.. వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల,కాచివానిసింగారం, చౌదరిగూడ విలీనం చేశారు.
పటాన్ చెరుతో పాటు పలు నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే గ్రామాలు మున్సిపాలిటీల్లోకి కలిశాయి. ఈ గ్రామాలన్నీ నగరంతో అనుసంధానం అయిపోయాయి. అదే సమయంలో విల్లాలు, ప్రాజెక్టులతో నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో వాటికి మెరుగైన సౌకర్యాలు కల్పించి మరింత వేగంగా నగరం అభివృద్ధి చెందేలా చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అసలు గ్రేటర్ హైదరాబాద్ మొత్తాన్ని విశాలంగా మార్చలనుకుంటున్నారు ఔటర్ లోపల ఉన్న దందా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కిందకు తేవాలన్న ఆలోచన కూడా ఉంది. ఇప్పటికే సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేశారు.