కేంద్ర ప్రభుత్వం తొలివిడతగా అభివృద్ధి చేయబోతున్న 20 స్మార్ట్‌సిటీల జాబితాను ప్రకటించింది. అందులో తెలంగాణ నుంచి ఒక్క నగరానికి కూడా చోటు దక్కలేదు. దీని మీద సహజంగానే కేంద్రం మీద విమర్శలు వస్తాయి.. ఆ విషయాన్ని పక్కన పెడితే.. తెలంగాణలో ఒక్కనగరం కూడా స్మార్ట్‌గా ఎంపిక కాకపోవడంపై తండ్రి కేసీఆర్ ఒకవైపు వెటకారం చేస్తూ ఉండగా, కొడుకు కేటీఆర్ మాత్రం హహాకారాలు చేస్తూ ఉండడం చిత్రంగా కనిపిస్తోంది. నిజానికి తండ్రీ కొడుకుల ఇద్దరి వైఖరి ఈ విషయంలో ఇలా పరస్పర విరుద్ధంగా ఉండడంలో రాజకీయ ప్రయోజనాలు మినహా మరో కారణం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
నిజానికి కేంద్రం గతంలో స్మార్ట్ సిటీల తొలిజాబితాను ప్రకటించినప్పుడు అందులో హైదరాబాదు పేరు కూడా ఉంది. బహుశా ఇప్పుడు విడుదల చేసిన తొలివిడత నిధులకు అర్హమైన 20 నగరాల జాబితాలో కూడా తప్పకుండా ఉండి ఉండేదేమో. కానీ.. తెలంగాణ సర్కారు చేజేతులా దాన్ని దూరం చేసుకుంది. హైదరాబాదుకు స్మార్ట్ సిటీ అవకాశం వద్దని పేర్కొంటూ దాని బదులుగా కరీంనగర్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతూ, కేసీఆర్ సర్కారు కేంద్రానికి ఒక లేఖ రాసింది. రాజధాని నగరం అభివృద్ధి మీద తమ ముద్ర ఉండాలే తప్ప.. కొత్తగా కేంద్రం తద్వారా భాజపా ముద్ర ఉండడం బహుశా కేసీఆర్‌కు నచ్చకపోయి ఉండొచ్చు. ఆ నేపథ్యంలో హైదరాబాదు జాబితానుంచి ఎగిరిపోయి ఉండొచ్చునని పలువురి అంచనా.
అయితే తాజాగా 20 నగరాల జాబితా.. గ్రేటర్ ఎన్నికల ప్రచార సమయంలో వెల్లడి కావడంతో దీనిమీద మళ్లీ చర్చ జరుగుతోంది. హైదరాబాదుకు వద్దు అనే విషయాన్ని తామే పేర్కొన్న సంగతిని కేసీఆర్ ఇండైరక్టుగా ప్రస్తావించుకుంటూ.. స్మార్ట్ సిటీ పేరుతో ఒక ఏడాది 200 కోట్లు, తర్వాత మూడేళ్లపాటూ ఇచ్చే మూడు వందల కోట్ల డబ్బుతో ఇక్కడ అభివృద్ధి ఏం సాధ్యమవుతుందని.. హైదరాబాదుకు ఆ మాత్రం సొమ్ము ఏ మూలకు సరిపోదు గనుక.. స్మార్ట్ కోటావద్దని చెప్పాం అని చెప్పుకుంటున్నారు. 500 కోట్లతో అభివృద్ధి చేయాలనుకున్న కేంద్రం వైఖరిని ఆయన వెటకారంగా మార్చేశారు. తద్వారా.. తామే స్మార్ట్ కేటాయింపు వద్దన్నామన్న అపప్రధ రాకుండా జాగ్రత్త తీసుకున్నారు.
కొడుకు కేటీఆర్ మాత్రం.. తెలంగాణలో ఒక్క నగరం కూడా కేంద్రానికి కనిపించలేదా? అంటూ హాహాకారాలు చేస్తున్నారు. ఇది కేంద్రం అనుసరిస్తున్న వివక్షపూరిత ధోరణికి నిదర్శనం అంటూ ఆయన గోల చేస్తున్నారు. ప్రస్తుతం బల్దియా ఎన్నికల్లో ఆయన సారథ్యం వహిస్తున్నారు. గనుక.. ఈ ప్రచారం ద్వారా భాజపా హైదరాబాదుకు ద్రోహం చేసింది అనే వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి అనుచితమైన రీతిలో కేటీఆర్ పాట్లు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.