ప్రపంచం సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తోంది. కాస్త ఆక్సిజన్ ఉంటే ఇవ్వమని కోరుకుంటోంది. కోవిడ్ బాధితులు ఆక్సిజన్ అందక అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నా – సెలబ్రెటీలూ తమ వంతు సహాయం చేసి, మానవత్వం చాటుకోవాల్సిన సందర్భం ఇది. ఈ విషయంలో సోనూసూద్ అందరికంటే ముందున్నాడు. సోనూని స్ఫూర్తిగా తీసుకుని, ఇంకొంతమంది సెలబ్రెటీలు ముందడగు వేస్తున్నారు. మేము సైతం అంటూ ఆపన్న హస్తం అందిస్తున్నారు. పాప్ గాయని స్మిత ఇప్పుడు ఇదే బాటలో నడవబోతోంది.
ఆక్సిజన్ సిలెండర్లు అందుబాటులో తేవడానికి స్మిత తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ లాంటి ప్రధాన నగరాల్లో ఆక్సిజన్ సిలెండర్లు అందుబాటులోకి తీసుకురావడానికి నడుం బిగించింది. కొంతమంది స్నేహితులతో కలిసి ఓ ట్రస్ట్ లా ఏర్పడి, ప్రధాన నగరాల్లోని కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సిలెండర్లు అందుబాటులో ఉంచడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ అప్ డేట్ ని స్మిత త్వరలోనే ఇవ్వబోతోంది. స్మిత ప్రయత్నం కొంతమంది ప్రాణాల్ని నిలబెట్టి, ఇంకొంతమందికైనా స్ఫూర్తి నివ్వగలిగితే.. అదే పది వేలు.