తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అదనపు కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారిని స్మిత సభర్వాల్ ఆంగ్లపత్రిక అవుట్ లుక్ పై పరువునష్టం దావా వేయబోతున్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అవుట్ లుక్ అగ్లీలుక్ గా మారడమే ఇందుకు కారణం. తనపై అశ్లీలపోకడతో రాసిన రైటప్, దాంతోపాటు ప్రచురితమైన కార్టూన్ తో మండిపడ్డ స్మిత సభర్వాల్ ఇప్పుడు ఆ పత్రికపై పదికోట్ల రూపాయలమేరకు సివిల్ దావా వేయబోతున్నట్టు వార్తలందుతున్నాయి. అంతేకాదు, కేసు నడిపించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం 15లక్షల రూపాయలను ఖర్చుల క్రింద విడుదలచేసింది.
అసలేం జరిగింది ?
ఆ మధ్యన అవుట్ లుక్ వీక్లీలో వచ్చిన రెండు వార్తా కథనాలు. అందులో ఒకటి స్మ్రితి ఇరాని పై ఏప్రిల్ 20 నాటి సంచికలో ప్రచురితమైన కధనంకాగా. రెండవది ఈ మధ్యనే స్మిత సభర్వాల్ గురించి ప్రచురితమైన అంశం పత్రిక స్థాయిని కిందకు పడతోసింది. దీంతో అవుట్ లుక్ పత్రిక కాస్తా అగ్లీలుక్ గా పేరుబడింది.
ఈ రెండు వార్తాంశాల్లో ఒకటే ధోరణి కనబడుతోంది. అవుట్ లుక్ పత్రిక ఉద్దేశపూర్వకంగానే మహిళాఅధికారులను, మంత్రులను లేదా ఉన్నతస్థానంలో ఉన్నవారిని అభాసుపాలు చేయాలనుకోవడం. మహిళల పట్ల ద్వేషభావం (misogyny) ఉండేలా రిపోర్ట్ చేయడం, లేదా అగ్లీగా చూపాలనుకోవడాన్ని ఒక స్టైల్ గా ఈ పత్రిక భావించినట్టు అనిపిస్తోంది. మహిళలు బరితెగించిపోతున్నారని చెప్పడం కూడా ఈ పత్రిక ఉద్దేశంలా కనబడుతోంది.
స్మ్రితి ఇరాని గురించిగానీ, స్మిత సభర్వాల్ గురించిగానీ వచ్చిన వార్తాంశంలో మహిళల తీరుతెన్నులను (వారి మాట, వారు వేసుకునే దుస్తులు, వారి ప్రవర్తన) దుయ్యపట్టడమే ప్రధానంశంగా కనబడుతున్నది. మరీ ఆశ్చర్యమనిపించే విషయం ఏమంటే, స్మిత సభర్వాల్ గురించి రాసింది (రిపోర్ట్ చేసింది) కూడా ఓ మహిళే (మాధవీ టాటా)కావడమే.
వివరాల్లోకి వెళితే… అవుట్ లుక్ ఆమధ్య తనఎడిషన్ లో తెలంగాణ వార్తాంశంగా `నో బోరింగ్ బాబు’ అన్న హెడ్ లైన్ కింద మాధవీ టాటా (హైదరాబాద్ బేస్డ్ అసిస్టెంట్ ఎడిటర్) ఓ కథనం రాశారు. అది కొద్దిరోజుల క్రిందట పెద్ద అగ్గి రగిల్చింది. మానవహక్కుల సంఘం మండిపడింది. పాతతరం జర్నలిస్ట్ లు ముక్కునవేలేసుకున్నారు. స్మిత సభర్వాల్ సదరు పత్రికకు లీగల్ నోటీస్ పంపించారు. ఇక ఇప్పుడు పరువునష్టం దావాకూడా వేయబోతున్నారు.
ప్రజలు మెచ్చిన అధికారిణి
స్మిత సభర్వాల్ పేరుగడించిన మహిళా ఐఏఎస్ అధికారిణి. కరీంనగర్ జిల్లాకు కలెక్టర్ గా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ఎన్నికలు (2014) కాగానే ఆమెను తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ (సీఎంఓ)లో బాధ్యతలు అప్పగించారు. జనం మనిషిగా, జనం మెచ్చిన ఐఏఎస్ అధికారిణిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిమీద ఒక వ్యాసం,లేదా వార్తాంశం రాసేటప్పుడు కనీసపు జాగ్రత్తలు తీసుకోవడం జర్నలిజంలో పాటించాల్సిన కనీస ధర్మం. ఈ ధర్మాన్ని పత్రిక ఎడిటర్ తుంగలోకి తొక్కేశాడు. లేదంటే డబ్బుకు ఆశపడి, కక్కుర్తిపడి ఇలాంటి పనిచేసిఉండాలి. పెయిడ్ వార్తాంశంగా ఎవరో ఉద్దేశపూర్వకంగా వేయించిఉంటారన్న అనుమానాలు కూడా అప్పట్లో వచ్చాయి.
పైగా అక్కడితో ఊరుకోలేదు ఈ పత్రిక, ఒక దిక్కుమాలిన కార్టూన్ పెట్టింది. సదరు మహిళా అధికారిణి సీఎంఓలో అంతా తానై అందచందాలు ఒలకబోస్తూ ర్యాంప్ మీద తిరగడాతున్నట్టుగా, ముఖ్యమంత్రితో సహా పలువురు నాయకులు కెమేరాల్లో ఆమె అందచందాలు బంధిస్తున్నట్టుగా ఉందా కార్టూన్.
జర్నలిజం నైతిక విలువలకు పాతర
జర్నలిజంలో మిడిమిడి జ్ఞానంకూడా లేకుండా ఏదో అదృష్టం తన్నుకొచ్చిన వాళ్లు జర్నలిస్టులైతే ఇలాంటి పరిణామాలు తప్పవు. ఒక వార్త లేదా వార్తాంశాన్ని ప్రచురించేముందు సదరు ఎడిటర్ అన్న వ్యక్తికి కొన్ని సందేహాలు ప్రాధమికంగా రావాలి. ఇక్కడ ఈ విషయంలో – పేరు ప్రస్తావించకపోయినా సీఎంఓ ఆఫీస్ లో పనిచేస్తున్న మహిళా అధికారిణి (ఐఏఎస్) ఫ్యాషన్ చీరలతో వగలుబోతోందీ, అన్ని వ్యవహారాలను తన గుప్పెట్లో పెట్టుకుంటున్నదన్న రిపోర్ట్ వచ్చినప్పుడు ఎడిటర్ అన్నవాడి బుర్రకు ఏది వేయాలో ఏది వేయకూడదో అర్థంకావాలి. సీఎంఓ ఆఫీస్ లో పనిచేసేవాళ్లు అక్కడ కాకపోతే వేరే ఎక్కడైనా తిరుగుతారా ? అన్న కనీసపు ప్రశ్న రావాలి. `ఐ క్యాండీ ‘, `లవ్లీ లేడీ’, `ట్రెండీ ట్రౌజర్ అండ్ ఫ్రిల్లీ టాప్’ అంటూ రిపోర్ట్ లో రాసేస్తే అలా ఎందుకు రాయాల్సివచ్చిందో ఆరా తీయాలి. కానీ అవన్నీ చేయకుండా, మహిళా అధికారిణి వృత్తిపరంగా ఎంతటి సిన్సియరో తెలుసుకోకుండా పుటుక్కున పబ్లిష్ చేస్తే ఇదిగో ఇలాగే తలనొప్పి తెచ్చుకోవాల్సి ఉంటుంది. జర్నలిజంనైతిక విలువలకు పాతరవేయడం అంటే ఇదే.
గతంలో స్మ్రితి ఇరానీ విషయంలో బొప్పికట్టినా బుద్ధి తెచ్చుకోక మళ్ళీ మహిళలను కించపరిచేలా రిపోర్ట్స్ వేయడాలు ఎడిటర్ బుద్ధితక్కువతనానికి పరాకాష్ఠ.
స్మిత కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు `అమ్మ లాలన’ పేరిట పథకం చక్కగా అమలుచేసి మంచి పేరుతెచ్చుకున్నారు. దీంతో ప్రధానమంత్రి నుంచి మెరుగైన పాలన అందించినందుకు అవార్డ్ కూడాఅందుకున్నారు.
ఇప్పుడు అవుట్ లుక్ కథనంపై స్మిత లీగల్ పరువునష్టం దావాకు సిద్ధంకావడం ఆ పత్రికకు చెంపదెబ్బే. దీంతోనైనా ఆ పత్రిక బుద్ధితెచ్చుకుంటుందేమో చూద్దాం.
– కణ్వస