తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సివిల్ సర్వీస్ అధికారుల్లో హాట్ టాపిక్ అయ్యారు. గుజరాత్ అల్లర్ల సమయంలో ” బిల్కిన్ బానో ” అత్యాచార, హత్య ఘటనల్లో శిక్ష పడిన వారికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ఈ అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అయితే అది బీజేపీయేతర రాజకీయ పార్టీల్లోనే. రిటైర్డ్ అధికారులు కొంత మంది స్పందన వ్యక్తం చేస్తున్నా.. సర్వీసులో ఉన్న వారు ఎవరూ నోరు తెరవలేదు. కానీ స్మితా సభర్వాల్ మాత్రం చాలా ఘాటుగా.. ప్రభుత్వ తీరును తప్పు పట్టేలా సోషల్ మీడియాలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
“ఓ మహిళగా, సివిల్ సర్వెంట్‌గా బిల్కిస్ బానో కేసుకి సంబంధించిన వార్తను చదివాక, పూర్తిగా నమ్మకం కోల్పోయాను. స్వతంత్ర దేశంలో ఉన్నాననే నమ్మకం కలగట్లేదు. ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా, స్వేచ్చగా ఊపిరి పీల్చుకునే ఆమె హక్కును మనం మళ్లీ తుడిచిపెట్టినట్టయింది. జస్టిస్ ఫర్ బిల్కిస్ బానో” అని ట్వీట్ చేశారు స్మిత సబర్వాల్. ఈ ట్వీట్‌తో ఆమె సివిల్ సర్వీస్ అధికారా లేకపోతే రాజకీయ నాయకురాలా అనే ప్రశ్నలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. రాజకీయ విమర్శలు వస్తున్నాయి. బిల్కిస్ బానోకేసులో టీఆర్ఎస్ నేతలు బీజేపీ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో స్మతా సభర్వాల్ ట్వీట్ రాజకీయంగానే ఎక్కువ హైలెట్ అవుతోంది.
స్మితా సభర్వాల్… తెలంగాణ ఏర్పడినప్పటి నుండి సీఎం పేషిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కి సంబంధించిన కీలక వ్యవహారాలన్నీ ఆమే చూస్తుంటారు. ఆమె కేసీఆర్ అభిమానం చూరగొనడానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలోనూక కొన్ని ఘటనలు జరిగాయి. తెలంగాణ ఉద్యమ సమయంతో పాటు.. తెలంగాణ వచ్చిన తర్వాత ఆమె భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న అంశాలు హైలెట్ అయ్యాయి. అప్పట్నుంచి టీఆర్ఎస్ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు.
స్మితా సభర్వాల్ భర్త అనున్ సభర్వాల్ ఐపీఎస్ అధికారి. వీరు తెలంగాణ క్యాడర్లో ఉన్నప్పటికీ.. హోంస్టేట్ బెంగాల్. స్మితాసభర్వాల్ స్పందన టీఆర్ఎస్ పెద్దలను మరింతగా మెప్పించి ఉంటుంది. అయితే.. తమకు వాక్ స్వేచ్చ ఉంటుందని.. నోరు నొక్కవద్దని ఆమె అంటున్నారు. అయితే ఇలాంటి ట్వీట్లు ఊరకనే చేయరని.. తెర వెనుక మంత్రాంగం ఉంటుందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.