కడప జిల్లాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్, చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి ఘటనలో నిందితుడు కొల్లం గంగిరెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఆయనపై వివిధ జిల్లాల్లో మొత్తం 31 కేసులు ఉన్నాయి. అన్నింటిలోనూ.. బెయిల్ వచ్చింది. ఈ కేసుల్లో 26 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు కాగా.. హత్యతో పాటు మరో ఐదు కేసులు నమోదయ్యాయి. అన్నింటిలోనూ బెయిల్ రావడంతో దీంతో.. ఆయన కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులకు బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు వైసీపీ అగ్ర కుటుంబానికి అత్యంత సన్నిహితుడయిన గంగిరెడ్డికీ బెయిల్ వచ్చేసింది.
అలిపిరి కుట్ర సహా 31 కేసుల గంగిరెడ్డి..!
అలిపిరిలో చంద్రబాబుపై మావోయిస్టలు దాడి చేసిన ఘటనలో… వారికి.. కొల్లం గంగిరెడ్డి సహాయసహకారాలు అందించారు. ఈ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ .. ఎన్నికల ఫలితాల్లో ముందంజలో ఉందన్న ట్రెండ్స్ రాగానే ఆయన అదృశ్యమయ్యారు. దాంతో.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన కోసం.. సాగించిన వేట.. ఓ రేంజ్ లో సాగింది. రెడ్ కర్నార్, ఇంటర్ పోల్ సహా.. అన్ని రకాల.. అవకాశాలను ఎదుర్కొని.. ఎక్కడ ఉన్నారో కనిపెట్టారు. చివరికి మారిషస్‌లో అరెస్ట్ చేశారు. రెండు, మూడు ఫేక్ పాస్‌పోర్టులతో.. ఆయన విదేశాల్లో తలదాచుకున్నారు. చివరికి పోలీసులు పట్టుకోగలిగారు. ఆ సమయంలో.. ఆంధ్ర పోలీసులకు అప్పగించకుండా.. విదేశీ యువతిని పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధపడ్డారన్న ప్రచారం జరిగింది. అయితే.. ఏపీ పోలీసులు అన్నింటినీ .. తేల్చేసి.. గంగిరెడ్డిని తీసుకొచ్చారు. 2015 లో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పట్నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.
గంగిరెడ్డి.. సాదా సీదా క్రిమినల్ కాదు…!
కడప జిల్లాలోని పుల్లంపేట మండలం వత్తలూరుకు చెందిన కొల్లం గంగిరెడ్డి నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. చిన్న వయసు నుంచే నేరాల బాటపట్టారు. 22 ఏళ్ల వయసులో అంబటి మురళీమోహన్ అనే వ్యాపార వేత్త హత్య కేసులో ప్రధాన నిందితుడు. ఈ కేసులో 1998లో యావజ్జీవ శిక్ష కూడాపడింది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక 198జీఓ ద్వారా పెరోల్‌పై బయటొచ్చిన కొల్లం గంగిరెడ్డి శిక్ష అనుభవించకుండానే దేశం విడిచి పారిపోయాడు. కొల్లం గంగిరెడ్డి .. సోదరుడు బ్రహ్మానందరెడ్డి.., పుల్లంపేట వైసీపీ బాధ్యతలు చూసుకుంటారు. ఇటీవల ఆయన మరణించారు. అయినప్పటికీ.. గంగిరెడ్డి కుటుంబం చేతుల్లోనే మండల వైసీపీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా పలుమార్లు గంగిరెడ్డి ఇంటికి వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి.
బెయిల్‌ను పోలీసులు ఎందుకు వ్యతిరేకించలేదు..!?
కొల్లం గంగిరెడ్డి లాంటి స్మగ్లర్, తీవ్రమైన నేరాలున్న… వ్యక్తి బెయిల్ పిటిషన్ వేసుకుంటే… పోలీసులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. బయటకు వస్తే.. మళ్లీ స్మగ్లింగ్ కార్యకలాపాలు.. బెదిరింపులకు పాల్పడతారని చెబుతారు. పైగా గంగిరెడ్డి.. గతంలో పెరోల్‌పై బయటకు వచ్చి.. విదేశాలకు పారిపోయిన రికార్డు ఉన్న నేరస్తుడు. ఇలాంటి కేసుల్లో పోలీసులు అసలు బెయిల్ పిటిషన్ ను… ఏ మాత్రం.. సమర్థించరు. తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కానీ ఇప్పుడు గంగిరెడ్డి విషయంలో… పోలీసులు భిన్నంగా వ్యవహరించారు. బెయిలిస్తే.. ఇబ్బందేమీ లేదన్నట్లుగా.. సైలెంట్ గా ఉండిపోయారు. ఫలితంగా గంగిరెడ్డికి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన.. మూడు నెలల్లోపే స్వేచ్చ లభించింది. కొసమెరుపేమిటంటే.. ఒకప్పుడు.. విదేశాల్లో తలదాచుకున్నా.. వెంటాడి.. వేటాడి జైలుకు పంపిన పోలీసులు… ప్రభుత్వం మారిన తర్వాత.. స్వేచ్చ ఇచ్చేలా తమ విధానాన్ని మార్చుకోవడం..!