హుజురాబాద్ బరిలో ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న అనేక వర్గాలు ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. నిరుద్యోగులతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నామినేషన్లు వేయించాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌ను కూడా నియమించారు. 200 మంది నిరుద్యోగులు బరిలో నిలుచుంటారని.. వారందరికీ తాము సాయం చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. మరో వైపు ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చడం లేదన్న కారణంతో 1000 మంది వరకు ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు వేస్తామని ప్రకటించారు.
ప్రతీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు కనీసం రూ.10వేల ధరావతు, అభ్యర్థికి మద్దతిస్తూ స్థానికంగా పదిమంది సంతకాలు చేయాలి. వీరిలో ఎంత మంది అ నిబంధనల ప్రకారం నామినేషన్లు వేస్తారో కానీ.. అభ్యర్థులు మాత్రం ఎక్కువ సంఖ్యలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. గతంలో నిజామాబాద్ ఎన్నికల్లో ఇలా పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. ఆ ఎన్నిక దేశం దృష్టిని ఆకర్షించింది.
ఈ సారి హుజురాబాద్ నామినేషన్లు కూడా హైలెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 1నుంచి నామినేషన్ దాఖలు ప్రారంభమైంది. ఇప్పటిదాకా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాత్రమే నామినేషన్ వేశారు. నామినేషన్లకు మరో నాలుగురోజులు మాత్రమే మిగిలి ఉంది. విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ వీలైనంత తక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యేలా చూడాలని ప్రయత్నిస్తోంది.