ఎన్నికల విధానంలో ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా సంస్కరణలు చేయాలనీ కోరుతూ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఆదివారంనాడు రాజస్థాన్ లోని శిఖర్ నగరం ఉద్యమం ప్రారంభించారు. సరిగ్గా అదే సమయంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి అన్నా హజారే అనుచరుడి చేతిలో ఒక లేఖ పెట్టి వెళ్ళిపోయాడు. అందులో ఆయనని చంపివేస్తామని హెచ్చరిక ఉంది. విదేశీ ఏజెంట్ అయిన అన్నా హజారేని ఈసారి కాకపోతో మరోకసారయినా తప్పకుండా చంపుతామని హెచ్చరించారు. కానీ ఆ లేఖను ఎవరు పంపారో..అన్నా హజారేపై ఎందుకు కక్ష కట్టారో తెలియజేయలేదు. ఈ విషయం తెలుసుకొన్న రాజస్థాన్ ప్రభుత్వం ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.
అన్నా హజారే ఆ లేఖలో హెచ్చరికపై స్పందిస్తూ అటువంటి బెదిరింపులు తను చాలా చూశానని వాటికి తను భయపడబోనని అన్నారు. ఎన్నికల సంస్కరణల గురించి మాట్లాడుతూ, “ఈసారి మా పోరాటం అధికార, ప్రతిపక్షాలతో కాదు. నేరుగా ఎన్నికల సంఘంతోనే జరుగుతుంది. ఎన్నికలలో చిహ్నాలు వాడటం అనవసరం. దాని స్థానంలో అభ్యర్ది పేరు, ఫోటో ఉంటే సరిపోతుంది. అదేవిధంగా పార్టీల పరంగా ఎన్నికలు నిర్వహించడం కంటే నేరుగా అభ్యర్ధులే పోటీ చేసే విధానం అమలులోకి తేవడం ద్వారా ఎన్నికలలో ధన ప్రభావం, అవినీతి కొంత అరికట్టవచ్చును,’ అని అన్నారు.
రిజర్వేషన్లపై కూడా అన్నా హజారే తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడున్న సామాజిక ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను బట్టి అప్పుడు రిజర్వేషన్ల విధానం ప్రవేశపెట్టారు. కానీ ఆరు దశాబ్దాల తరువాత కూడా నేటికీ ఆ విధానం కొనసాగించడం సరికాదు. ఒకప్పుడు సమాజంలో అణచివేతకు గురయినవారికి సమానావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే యా విధానం ప్రవేశ పెట్టారు. కానీ అదిప్పుడు రాజకీయ నాయకుల చేతుల్లో పది దురుపయోగం అవుతోంది. ఈ రిజర్వేషన్ల విధానాన్ని వారి అవసరమయినట్లు ఉపయోగించుకొంటున్నారు తప్ప నిజంగా దానిపై శ్రద్ధ ఉండి కాదు. కనుక దేశంలో రిజర్వేషన్ వ్యవస్థను ఎత్తివేయవలసిన సమయం ఆసన్నమయింది,” అని అన్నారు.