మొన్నామధ్య జీవిత రాజశేఖర్ పై పదునైన ఆరోపణలు చేసి కొత్త వివాదాన్ని తలకెత్తుకున్న సామాజిక కార్యకర్త సంధ్య, టీవీ చానల్ డిబేట్ లో -“ఒకానొక సందర్భంలో చిరంజీవి అమాయకత్వం చూసి నవ్వొచ్చింది” అంటూ వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే జీవిత రాజశేఖర్ పైన చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఒక చానల్లో మాట్లాడింది సంధ్య. ఆ డిబేట్ లోనే, శ్రీ రెడ్డిని పవన్ కళ్యాణ్ పై పురమాయించింది రాంగోపాల్ వర్మ అని లీక్ చేసింది. ఆ తర్వాత ఇదే విషయమై రాంగోపాల్ వర్మ వివరణ ఇచ్చాడు. ఇక ఇదే డిబేట్లో మాట్లాడుతూ చిరంజీవి కూతురు శ్రీజ తన మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ నుంచి విడిపోయి తన కూతురితో సహా చిరంజీవి దగ్గరికి వచ్చేసింది. అయితే అలా వచ్చే ముందు చిరంజీవి సంధ్యకు ఫోన్ చేసి అడిగాడట- పాపతో సహా తీసుకు వచ్చేస్తున్నాం కదా , “పాపను ఎలా తీసుకెళ్తారని కేసు పెట్టే అవకాశం ఏమైనా ఉందా” అని సలహా అడిగారట. దీనికి సంధ్య, “అలాంటిదేమీ ఉండదు సర్, బిడ్డకు 18 ఏళ్లు వచ్చేవరకూ తల్లి సంరక్షణ లోనే ఉండొచ్చు, అందులో తప్పేమీ లేదు, కేసు పెట్టే అవకాశం లేదు” అని వివరించిందిట. ఇదీ విషయం అని చెబుతూ, “కానీ అంత అమాయకమైన ప్రశ్న అడిగిన చిరంజీవి ని చూస్తే నాకు నవ్వొచ్చింది” అంటూ మీడియాలో చెప్పుకొచ్చింది.
అయితే ఆమె వ్యాఖ్యలు విన్న చిరంజీవి అభిమానులు -చిరంజీవి న్యాయసలహా తీసుకోవాలనుకుంటే ఎంతోమంది లాయర్లు ఉన్నారని, కాని మీ మీద గౌరవంతో, నమ్మకంతో మిమ్మల్ని సలహా అడిగితే ఆ నమ్మకాన్ని పోగొట్టుకునేలా మీరు మీడియాలో ఆ విషయం ప్రస్తావించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే, ఇంకో అడుగు ముందుకు వేసి చిరంజీవి అంత అమాయకుడు కాదు, ఈ విషయం ఏదైనా కాంట్రవర్సీ అయితే అవతలివాళ్లు సంప్రదించేది మిమ్మల్నే అని తెలిసి, కావాలని మిమ్మల్ని సలహా అడిగాడు అని కౌంటర్ ఇస్తున్నారు.