చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అని పెద్దలు చెబుతారు. మూడు కోతుల్ని బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుని ఈ ప్రచారాన్ని చిన్నతనంలోనే మనసులో నాటేందుకు ప్రయత్నించేవారు. అయితే మారుతున్న సమాజంలో ఇప్పుడు ఈ మూడు కోతులకు తోడు మరో కోతిని తెచ్చి జాగ్రత్తలు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. చెడు వినవద్దు, చూడవద్దు..మాట్లాడవద్దు అనే దానికి తోడు చెడు పోస్టులు పెట్టవద్దు అని హితవులు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఆ మూడు కోతులకు తోడుగా నాలుగో కోతి కూడా వచ్చేసింది.
ఈ విషయంలో అందర్నీ చైతన్యం చేయాల్సిన బాధ్యతను కొంత మంది తీసుకున్నారు. నాలుగో కోతిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుని విస్తృతంగా ప్రచాం చేసేస్తున్నాు. సోషల్ మీడియాను మంచికే వాడుదామని ఏపీ మొత్తం పోస్టులతో నింపేస్తున్నారు. పెద్ద పెద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలు పెడుతున్నారు. సినీ తారాలతోనూ సందేశాలు ఇప్పిస్తున్నారు. ఈ పోస్టర్లు అన్నీ వైరల్ అవుతున్నాయి. నటీనటులు చెప్పే మాటలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి.
సోషల్ మీడియాను మంచికి వాడుతున్న వారి సంఖ్య పది శాతం ఉంటుంది…మిగతా 90 శాతం అసత్య ప్రచారాలకు… దూషణలకు ..మోసాలకు వాడుకుంటున్నారు. రాజకీయపార్టీల సోషల్ మీడియా సైన్యాలు అయితే సోషల్ మీడియాను కలుషితం చేసి పడేశాయి. ఇప్పుడు వాటిని సంస్కరించడం అంత తేలిక కాదు. కానీ ఎవరో ఒకరు ముందుకు వచ్చి .. చర్చ పెట్టకపోతే ఇంకా ఇంకా సోషల్ మీడియా కుళ్లిపోతుందని ఇలా ముందుకు వచ్చినట్లుగా ఉన్నారు . భారీ ఖర్చుతో సమాజ సేవ కోసం తమ ప్రయత్నం చేస్తున్నారు. తమకు పబ్లిసిటీ అవసరం లేదనుకున్నారో లేకపోతే సీక్రెసీ మెయిన్ టెయిన్ చేయాలనుకున్నారో కానీ తమ ఐడెంటిటీని మాత్రం గోప్యంగానే ఉంచుకున్నారు.