మాల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారనీ, అందుకే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారనే ప్రచారం జరిగింది. దీంతో మీడియాతోపాటు సోషల్ మీడియాలో కూడా కాబోయే పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి అంటూ కథనాలు వచ్చేశాయి. సోషల్ మీడియాలో మరింత హడావుడి కనిపించింది. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద సంఖ్యలో అభిమానుల పోస్టింగుల హడావుడి కనిపించింది. రేపోమాపో అధికారికంగా రేవంత్ ప్రకటించడమే తరువాయి అన్నట్టుగా ఉంది.
ఇలాంటి లీకుల నేపథ్యంలో పీసీసీ పదవి కోసం ఎప్పట్నుంచో పోటీపడుతున్న సీనియర్లు ఢిల్లీ వెళ్లే ప్రయత్నం చేయడం, ఈ మధ్యనే పార్టీలోకి వచ్చిన రేవంత్ కి కీలక పదవి ఎలా ఇస్తారనే అసంతృప్తి వ్యక్తం చేయడం చూశాం. దీంతో ఎందుకీ లొల్లి అని ఇప్పట్లో పీసీసీ మార్పులేదని తేల్చేసింది హైకమాండ్. డిసెంబర్ వరకూ పీసీసీ అధ్యక్ష బాధ్యతల్లో ఎలాంటి మార్పు ఉండదనేది తాజా సమాచారం. అయితే, ఇదే సమయంలో తనకు పదవి వచ్చేసిందని హైకమాండ్ కంటే ముందుగానే రేవంత్ రెడ్డి లీకులు ఇచ్చారనీ, సోషల్ మీడియాలో ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారంటే, మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయంటే కారణం ఆయనే అంటూ ఓ ఫిర్యాదు హైకమాండ్ కి కొందరు నేతలు పంపినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
రేవంత్ రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా చేయబోతున్నారనే లీకులు కూడా వ్యూహాత్మకంగానే కొందరు సీనియర్లు ఇచ్చారనీ, సోషల్ మీడియాలో రేవంత్ పేరుతో పెద్ద ఎత్తు శుభాకాంక్షల వెనక కూడా ఓ వ్యూహం ఉందని గాంధీ భవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హైకమాండ్ ప్రకటన కంటే రేవంత్ ముందుగానే స్పందించేస్తున్నారనీ, తనని తాను పీసీసీ అధ్యక్షుడిగా ప్రచారం చేసేసుకుంటున్నారు అభిప్రాయాన్ని కలిగించాలనే వ్యూహం దీని వెనక ఉందంటూ వినిపిస్తోంది! నిజానికి, హైకమాండ్ దగ్గర రేవంత్ కి మంచి పేరుంది. దాన్ని దెబ్బదీసే ప్రయత్నం జరుగుతోందనీ కొందరు అంటున్నారు. డిసెంబర్ దాకా టీపీసీసీ ని మార్చాలని హైకమాండ్ అనుకోవడం లేదు కాబట్టి, రేవంత్ అంటే గిట్టని కాంగ్రెస్ నేతలు ఇలాంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తారు అనే అభిప్రాయమూ వ్యక్తమౌతోంది.