కొన్ని వారాల క్రితం సునీత విలియమ్స్ తన అంతరిక్షయానం పూర్తిచేసి భూమికి చేరినప్పుడు ప్రపంచం మొత్తం ఆమెకు జేజేలు కొట్టింది. ఆమె భారతదేశపు సంతతే కాబట్టి మన సంపదే అన్నంతలా దేశం మొత్తం సంబరాలు చేసుకుంది. ఆమె తెగువని చూసి కొనియాడని మనిషే లేడు. అంతెందుకు ఎప్పటికప్పుడు స్త్రీ సాధికారత గురించి తెగ గొప్పలు చెప్పేస్తూ ఉంటాం, స్పీచులు ఇచ్చేస్తూ ఉంటాం!
ఒకవైపు పైవన్నీ చేస్తూనే సోషల్ మీడియాలో వాళ్లపై జరుగుతున్న దాడులను చూస్తూ, చూసీ చూడనట్టుగా నటించి , ఆ సమస్యపై సీత కన్నేస్తూ ఉంటాం. స్త్రీలకు గౌరవం ఇవ్వడం అంటే వాళ్లకు సన్మానాలో, పాలాభిషేకాలో చేయాల్సిన అవసరం లేదని, వాళ్ళ బ్రతుకులను వాళ్ళను బ్రతకనిస్తే చాలన్న చిన్న విషయాన్ని మర్చిపోతుంటాం. గత కొన్నేళ్లుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విషపు పోకడలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో పెద్దల అండతో వైసీపీ సోషల్ మీడియాలో ఒక వర్గపు మూక రెచ్చిపోయిన తీరు చూసి, రెండు తెలుగు రాష్ట్రాలు నిర్ఘాంతపోవడం తప్ప ఏమీ చేయలేకపోయాయి. మేధావి వర్గాలు సైతం తప్పులను తప్పని చెప్పలేని భయానక పరిస్థితులను అప్పుడు చూసాం. అప్పటి ప్రభుత్వంలో ఉన్న నేతలే ఇలాంటి హేయమైన రీతిని సమర్ధించడంతో సదరు అనుబంధ సోషల్ మీడియా మూకకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో అప్పటి అధికారపార్టీ నేతలే సాక్షాత్తూ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబంలో స్త్రీలపై ఉన్మాదపూరిత భాషతో దాడులు చేసినా కూడా వాళ్ళను మందలించే నేతలే కరువయ్యారు అప్పట్లో. అప్పట్లో చంద్రబాబు కంట నీరు పెట్టిన దృశ్యాన్ని చూసి చలించని హృదయమే లేదు. ఆనాటి నేతలే ఇలాంటి భాషను అనుసరించడంతో యధా రాజా తదా ప్రజా అన్నట్టుగా ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్లో ఒక వర్గం చెలరేగిపోయేవారు. ఇప్పటికీ కొంతమంది అదే బాటలో నడుస్తున్నారు కూడా.ఈ ఉన్మాదుల్లో ఐటీడీపీ కార్యకర్త అరెస్ట్ తో ఒకరకమైన వణుకు మొదలైందని చెప్పుకోవచ్చు.
స్త్రీలపట్ల హేయమైన భాషను ఉపేక్షించబోమని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీల సోషల్ కార్యకర్తలకూ సాలిడ్ వార్నింగ్ ఇచ్చేసారు చంద్రబాబు. ఆదినుండీ వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధానాలను వ్యతిరేకించే చంద్రబాబు “ఎవడైనా సోషల్ మీడియాలో తప్పుడు కూతలు కూస్తే వాళ్ళకదే చివరి రోజు చేస్తాం” అంటూ కాస్త ఆయనశైలికి భిన్నంగానే హెచ్చరికలు జారీ చేశారు. ఈ జాడ్యం ఒక్క రాజకీయ రంగానికే కాదు సినీ రంగానికి సైతం సోకింది. తమ అభిమాన నటులకు కాస్త వ్యతిరేకం అనిపించినా, పోటీ అనిపించినా దురభిమానంతో మూకలు రెచ్చిపోతున్నాయి. బూతులతో, మార్ఫింగ్ ఫొటోలతో, మార్ఫింగ్ వీడియోలతో వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో స్త్రీలపై మాత్రమే పసిబిడ్డలపై కూడా పైశాచికత్వాన్ని చూపిస్తున్నారు. ఇలాంటి సోషల్ మీడియా పైత్యానికి గురికాని సినీ రాజకీయ కుటుంబాలే లేవనే చెప్పుకోవచ్చు రెండు తెలుగురాష్ట్రాల్లో. నిన్నటి అరెస్టుతో ఈ బరితెగింపు తగ్గే అవకాశాలున్నాయని మనం భావించినా ఇలాంటివారిపై అలసత్వం వహిస్తే మానవత్వపు మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయి.