తమలపాకుతో నువ్వకొటి అంటే.. తలుపు చెక్కతో నేను రెండు అంటా అన్నట్లుగా ఏపీలో రెండు పార్టీల నేతలూ.. సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రెండు పార్టీలకు చెందిన వారి పోస్టులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకరినొకరు అసభ్యంగా తిట్టుకుంటున్నారు. కుటుంబాల కేంద్రంగా ఆన్ లైన్ వేదికగా రచ్చ చేసుకుంటున్నారు. వాళ్ల పోస్టులు .. వీళ్ల పోస్టులు వాళ్లూ వైరల్ చేసుకుంటున్నారు. ఫలానా టీడీపీ వారియర్ ఇలా పోస్టు పెట్టాడు.. దీనికి కౌంటర్ అంటూ.. మరో పార్టీ వాళ్లు పోస్టులు పెడుతున్నారు. అలా.. వారికి తెలియకుండానే ఇతరుల పోస్టులు వైరల్ చేస్తున్నారు. దీం వారి వారి పార్టీలను.. నేతల్ని వారికి తెలియకుండానే బద్నాం చేసుకుంటున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాలని జగన్ నిర్ణయించిన తర్వాత పూర్తి స్థాయిలో యుద్ధం జరుగుతోంది. సీనియర్ ఎన్టీఆర్ ఎలాంటి వ్యక్తి.. వైఎస్ఆర్ క్యారెక్టర్ ఎలాంటి అనే చర్చను ప్రారంభించేశారు. ఒకరికొకరు పోటీగా వీడియోలు పోస్ట్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ పై దాడిశెట్టి రాజా లాంటి నేతలు చేసే రకరకాల వ్యాఖ్యాలను సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రజెంట్ చేస్తున్నారు. పోటీగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా గతంలో రోశయ్య మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారు. తాజాగా జగ్గారెడ్డి వైఎస్ చనిపోయిన సమయంలో ఏ మాత్రం బాధ లేకుండా కుటుంబం అంతా కూర్చుని ముఖ్యమంత్రి పదవి గురించి చర్చించుకున్నారని చేసిన వ్యాఖ్యలనూ హైలెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
వైఎస్ఆర్‌సీపీనేతలు చంద్రబాబు మాకు ఎన్టీఆర్ అవసరం లేదని అన్నారంటూ ఓ పత్రికలో వచ్చిన క్లిప్పింగ్‌ను పోస్టర్లుగా ప్రింట్ చేసి అంటించారు. వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ చేశారు. ఇప్పుడు టీడీపీ నేతలు పోటీగా భారత్ పే కు పోటీగా భారతీపే అనే పోస్టర్లు అంటిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పేటీఎంకు పేరడీగా పేసీఎం పోస్టర్లు తెచ్చి నలభై శాతం కమిషన్లు యాక్సెప్ట్ చేస్తారన్నట్లుగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఇప్పుడు భారతీ పే పేరుతో టీడీపీ నేతలు పోస్టర్లు వేస్తున్నారు. స్ట్రాటజిస్టులను పెట్టుకుని మరీ సోషల్ మీడియా సైన్యాలను నడిపిస్తున్నాయి. రూ. కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఇంత భారీగా ఖర్చు పెట్టి మరీ నేల బారు రాజకీయం చేసుకుంటున్నాయి.