చంద్రబాబునాయుడు సోదరుడు రామ్మూర్తినాయుడు చనిపోయారు. ఆయన చాలా కాలంగా బయటకు రాలేనంత అనారోగ్యంతో ఉన్నారు. రామ్మూర్తినాయుడు చనిపోయినా నందమూరి కుటుంబంలో కొందరు స్పందించలేదని సోషల్మీడియాలో కొందరు బాధపడిపోయారు. వారి ఉద్దేశం సోషల్ మీడియాలో స్పందించి.. సంతాపం తెలియచేయాలని. వారు వ్యక్తిగతంగా సంతాపం ప్రకటించి ఉంటారు ఎవరికి తెలుసు.
చిన్న చిన్న విషయాలు చూపించి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడానికి సోషల్ మీడియాలో ఎప్పుడూ కొంతమంది రెడీగా ఉంటారు. వారికి తెలిసిన ప్రపంచం సోషల్ మీడియాస్. వారికి తెలిస్తే చేసినట్లు.. తెలియకపోతే చేయనట్లు. ఆయా కుటుంబాల్లో ఏం జరుగుతుందో కనీస అవగాహన కూడా ఉండదు. కానీ ఇష్టం వచ్చినట్లుగా ఊహించి.. స్పందించలేదు అని.. సన్నాయి నొక్కులు నొక్కడమే వీరికి తెలుసు.
స్పందించాలా లేదా అన్నది వ్యక్తుల ఇష్టాఇష్టాలను బట్టి ఉంటుంది. వారికి ఇష్టమైతే బహిరంగంగా స్పందిస్తారు. కుటుంబ విషయం కాబట్టి బయట పెట్టదల్చుకోలేదంటే.. వ్యక్తిగతంగా స్పందించారు. మన ఫ్యామిలీ వాడికి మనం ఏదో పరాయి వాళ్లం అయినట్లుగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పడేయడం ఏమిటి అనుకుంటే.. అలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఇలాంటి విషయాలపై ఈ స్పందించలేదేంటి అనే బ్యాచ్ కు స్పష్టత ఉండదు. ఓ రాయి వేయడమే వీరికి అలవాటు. వీరికి ఎప్పుడూ ఆ ఎన్టీఆర్, మెగా ఫ్యామిలీ మాత్రమే ఎప్పటికప్పుడు టార్గెట్ .