వైసీపీలో సోషల్ మీడియా పదవుల చిచ్చు ప్రారంభమయింది. ఇటీవల తాడేపల్లిలోని ఓ హోటల్లో చురుకుగా పని చేస్తున్న సోషల్ మీడియా వారందర్నీ పిలిచి చిన్న చిన్న గిఫ్టులు ఇచ్చి.. విందులు ఇచ్చి… పదవులు కూడా పంపిణీ చేశారు. ప్రతి జిల్లాకు ఓ కన్వీనర్.. మరికొంత మంది కో కన్వీనర్లను నియమించారు. అయితే ఈ పదవుల పంపకం అనేక రకాలగా చిచ్చుకు కారణం అవుతోంది. నియమితులైన వాళ్లంతా పార్టీ అధికారంలోకి వచ్చాక .. టీడీపీని బూతులు తిట్టి అడ్వాంటేజ్ తెచ్చుకున్న వారేనని కానీ తాము పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడిన వాళ్లమని.. మాకేదీ గుర్తింపని చాలా మంది తెరపైకి వస్తున్నారు.
ఒకప్పుడు మూడు జిల్లాలకు సోషల్ మీడియా ఇంచార్జ్ గా చేసిన తనను ఓ జిల్లాకు కో కన్వినర్‌గా నియమించారంటూ ఓ సోషల్ మీడియా నేత చాలా పెద్ద లేఖ రాసి రాజీనామా చేశారు. ఇది వాట్సాప్‌లలో విస్తృతంగా వైరల్ అవుతోంది. చాలా మంది సోషల్ మీడియా సైనికులు సైలెంట్ అయ్యారు. పార్టీ కోసం ఇప్పుడు పని చేసి వచ్చే ప్రభుత్వంలో టార్గెట్ కావడం ఎందుకని చాలా మంది ఊరుకుంటున్నారు. దీంతో వారందర్నీ బుజ్జగించడానికి వైసీపీ హైకమాండ్ చాలా ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పుడు ఇచ్చి కన్వీనర్.. కో కన్వీనర్ పదవులేనని.. ఇంకాచాలా ఉన్నాయని చెబుతోంది. అయితే ఇప్పటివరకూ పట్టించుకోని వారు ఇక ముందేమీ పట్టించుకుంటారన్న వాదన వినిపిస్తోంది. గతంలో అంతా తానై వ్యవహరించిన ఓ సోషల్ కీలక నేత .. బెంగళూరులో వైద్యం అందక చనిపోతే కనీసం పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి వైసీపీసోషల్ మీడియాను ఏదో విధంగా యాక్టివ్ చేయాలనుకుంటే.. అది రివర్స్ అవుతోంది.