ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలతో మీడియామొత్తం హోరెత్తించినా.. సోషల్ మీడియాలో మాత్రం.. ఆయనకు మద్దతుగా ట్రెండింగ్ కనిపిస్తోంది. కరుడు గట్టిన టీఆర్ఎస్ మద్దతు దారులు కూడా.. ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఓ రకంగా వారికి మనసొప్పలేదని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పని చేసిన నేతల్లో ఒకరైన ఈటలపై.. రాజకీయ కుట్ర జరుగుతోందన్న అభిప్రాయమే ఎక్కువగా ఉద్యమకారుల్లో ఉంది. ఫలితంగా.. టీఆర్ఎస్ హైకమాండే వ్యూహాత్మకంగా.. ఈటలను టార్గెట్ చేసిందని తెలిసినా… ఆ పార్టీ క్యాడర్ చాలా వరకు సైలెంట్‌గా ఉంటున్నారు. ఇతరులు అయితే ఈటలకు సంఘిభవం తెలియచేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.
కేసీఆర్ రాజకీయ కుట్రకు ఈటలను బలి చేయబోతున్నారన్న విశ్లేషణలే సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తున్నాయి. నాడు ఆలె నరేంద్ర.. ఆ తర్వాత విజయశాంతి.. ఆతర్వాత రాజయ్యతో పాటు పలువురు.. నేతలకు అదే పరిస్థితి పట్టింది. తెలంగాణలో ఇతర పార్టీల్ని నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో.. పెద్ద ఎత్తున నేతల్ని చేర్చుకున్నారు. సైడైపోయిన అనేక మంది నేతల్ని గుర్తు చేసి.. ఈటలది కూడా అదే పరిస్థితి అనివిశ్లేషిస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ప్రెస్‌మీట్ పెట్టిన ఈటల.. తనపై కుట్ర జరుగుతున్నదన్న విషయం తెలిసి కూడా ఎక్కడా ఆవేశపడలేదు. నిజాల్ని నిగ్గు తేల్చాలనే కోరారు. దీంతో ఆయనకు సానుభూతి మరింత పెరిగింది.
ఈటల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు టీఆర్ఎస్లో నివురు గప్పిన నిప్పులా మారింది. బురద చల్లేస్తే.. మీడియా అండతో.. ఇమేజ్ను కించ పరిస్తే …ప్రజలకు దూరమయ్యేపరిస్థితి లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీఆర్ఎస్లోనే ఈటలకు సానుభూతి లభిస్తూండటం.. అదీ ఉద్యమ నేపధ్యం ఉన్న నేతల్లో ఆవేదన కనిపిస్తూండటం.. ఖచ్చితంగా ముందు ముందు ఆసక్తికర పరిణామాలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.