హైదరాబాద్ పోలీసులు వివిధ కాలనీల్లో తాము ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించడానికి ఓ విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో… చిక్కడపల్లిలో ఏర్పాటు చేసిన ఒక కెమెరాలో.. ఓ వ్యక్తి టూవీలర్ మీద ఓ సందులోకి వచ్చి బండి నేమ్ ప్లేట్ మార్చడం.. డ్రెస్ చేంజ్ చేసుకోవడం గమనించారు. ఇదేదో తేడాగా ఉందని… సీసీకెమెరాలన్నింటినీ జల్లెడపెట్టారు. రివైండ్ చేసుకుంటూ.. చేసుకుంటూ .. ఆ వాహనం ఎటు వైపు నుంచి వచ్చిందో చూసుకుంటూ వెళ్లారు. వంద కెమెరాల ఫీడ్ పరిశీలించిన తర్వాత అసలు విషయం బయట పడింది. ఆ వాహనంపై ఉన్న వ్యక్తి… చైన్ స్నాచింగ్ చేసేసి.. ఆ సందులోకి వచ్చి ఎవరికీ తెలియకుండా నెంబర్ ప్లేట్… షర్టు మార్చేసుకుని మళ్లీ మెయిన్ రోడ్ మీదకు వెళ్లాడు.
ఈ సీసీ టీవీ ఫుటేజీ మొత్తాన్ని గాలించి.. ఆ చైన్ స్నాచర్ ఎవరో కూడా.. పోలీసులు గుర్తించారు. అతని పేరు రామకృష్ణ. గాంధీనగర్‌లో ఉంటాడు. అతనిని పట్టుకున్న పోలీసులకు మైండ్ బ్లాంకయ్యే నిజాలు తెలిశాయి. అతను ఎంబీఏ చదివాడు. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అయినా..చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. అదే మొదటి సారి కాదని.. గతంలో చాలా సార్లు ఇలా చైన్ స్నాచింగ్ చేశాడని గుర్తించారు. అతని వద్ద ఉన్న బంగాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా గౌరవనీయమైన ఉద్యోగం చేస్తూ.. ఇలా చైన్ స్నాచింగ్ చేయడానికి కారణం.. అదేదో కసామిసా రోగం కాదు. నిజంగానే దొంగ తనాలకు అలవాటు పడ్డాడు. తనకు వచ్చే ఐదు అంకెల జీతం మొత్తం జల్సాలకే ఖర్చు పెట్టడం కాకుండా.. తీర్చలేనంత అప్పులు చేశాడు. వచ్చే జీతం ఈఎంఐలకే పోతూండటంతో ఇతర జల్సాలకు ఏం చేయాలో తెలియక చైన్ స్నాచింగ్‌ల బాట పట్టాడు. చివరికి సీసీ కెమెరాలో షర్టు మార్చుకుంటూ దొరికిపోయాడు.