వర్క్ ఫ్రం హోం యుగంలో గృహహింస కేసులు పెరుగుతున్నాయని రికార్డులు చెబుతున్నాయి. అయితే ఇవి హత్యలకూ వెళ్తున్నాయని కూడా ఇటీవల వరుసగా జరుగుతున్న కొన్ని నేరాలు నిరూపిస్తున్నాయి. బెంగళూరులో మంచికంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ వర్క్ ఫ్రం హోం కారణంగా తిరుపతికి వచ్చి ఉంటున్న ఓ జంట మధ్య ఏర్పిడన మనస్పర్థలు.. హత్యకు దారి తీశాయి. సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అయిన భర్త.. తన టాలెంట్‌కు క్రిమినాలజీ జోడించడంలో అదో మర్డర్ మిస్టరీ అయింది.
గత వారం తిరుపతి రుయా ఆస్పత్రి క్యాంపస్ గోడ పక్కన ఓ గుర్తు తెలియని శవం సగం కాలిన పొజిషన్లో బయటపడింది. ఆ శవం సూట్‌కేసులో కుక్కి ఉంది. పరిశీలన జరిపిన పోలీసులు.. మహిళదిగా నిర్ధారించారు. ఆస్పత్రిలోనిది కాదని నిర్ధారించుకున్న తర్వాత దొరికిన ఆధారాలను బట్టి కూపీలాగారు. దాంతో.. హతురాలు ఓ సాఫ్ట్వేర్ సంస్థలో మంచి పొజిషన్లో ఉద్యోగి అని తేలింది. ఆమెను హత్య చేసింది ఆమె భర్తేనని.. అతను కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగేనని తేలింది.
చిత్తూరు జిల్లా రామసముద్రం కు చెందిన భువనేశ్వరి కడప జిల్లా గోపవరం మండలం శ్రీకాంత్ రెడ్డిని ప్రేమించి మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రం హోం కావడంతో మూడు నెలల క్రితం తిరుపతి నగరంలో డిబిఆర్ ఆసుపత్రి రోడ్డులో అపార్టుమెంట్ అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. భర్త శ్రీకాంత్ రెడ్డి..భువనేశ్వరిని హత్య చేసి సూట్ కేసులో కుక్కి రూయా ఆసుపత్రి మెడిసిన్ గౌడౌన్ వెనక కాల్చివేశారు. ప్లాట్ లో హత్య చేసి..మృతదేహం ఉన్న సూట్ కేసు ను అద్దె కారులో రూయా ఆవరణకు తరలించాడు. సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలను బట్టి.. టాక్సీ డ్రైవర్ ను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో మొత్తం బయటపడింది.
పోలీసులు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అంత దారుణంగా చంపడానికి కారణాలేమిటో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే.. ఉన్నత చదువులు చదివినా… మైండ్లోకి క్రిమినల్ ఆలోచనలు వస్తే.. ఎవరైనా రాక్షసుడిగా మారిపోతారని.. శ్రీకాంత్ రెడ్డి నిరూపించాడు.