నాగార్జున కెరీర్లో సూపర్ డూపర్ హిట్.. సోగ్గాడే చిన్ని నాయిన. అప్పట్లో ఈ సినిమా రూ.50 కోట్లు వసూలు చేసింది. నాగార్జున సినిమా ఈ స్థాయిలో వసూళ్లు తెచ్చుకోవడం అదే ప్రధమం. ఇప్పటికి నాగ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు తీసుకొచ్చిన సినిమా అదే. దానికి ప్రీక్వెల్ గా `బంగార్రాజు` తెరకెక్కింది. ఇప్పుడు సంక్రాంతికి కూడా సిద్ధమైంది. అప్పట్లో `సోగ్గాడే..`గా నాగ్ సోలోగా వచ్చాడు. ఇప్పుడు `బంగార్రాజు`గా.. నాగ చైతన్యతో కలసి వస్తున్నాడు. `సోగ్గాడే… 3` తీస్తే, అందులో అఖిల్ కూడా కనిపిస్తాడా? అనేది తాజా ప్రశ్న.
`బంగార్రాజు..` ప్రెస్ మీట్లో నాగార్జునకు ఈ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన నవ్వుతూనే సమాధానం చెప్పారు. `బంగార్రాజు రానివ్వండి.. రిజల్ట్ బట్టి చూద్దాం` అనేశారు. కాకపోతే.. దర్శకుడు కల్యాణ్ కృష్ణకి.. సోగ్గాడేకి సీక్వెల్ కూడా చేయాలని ఉంది. సోగ్గాడేకి ప్రీక్వెల్ గా బంగార్రాజు వచ్చినట్టు, సోగ్గాడే 2 కూడా తీసే ఆలోచన ఉంది. అందులో నాగ్, నాగచైతన్యతో పాటు అఖిల్ కూడా కనిపిస్తాడట. సోగ్గాడే ఫ్రాంచైజీని కొనసాగిస్తే బాగుంటుందన్నది కల్యాణ్ కృష్ణ ఆలోచన. అయితే.. ఇది జరగాలంటే.. బంగార్రాజు బాగా ఆడాలి. సోగ్గాడేకి సీక్వెల్ ఉంటుందా, లేదా? అనేది జనవరి 14న తేలిపోతుంది. ఒకవేళ.. బంగార్రాజు కూడా హిట్టయిపోతే, ప్రతీ సంక్రాంతికీ…ఈ ఫ్రాంచైజీ నుంచి ఓ సినిమా రావడం ఖాయం.