ఈసారి సంక్రాంతికి సినిమా సందడి ఉంటుందా? లేదా? అనే మీమాంశకు తెర పడింది. వరుసగా సినిమాల్ని ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే.. క్రాక్, రెడ్, మాస్టర్ (డబ్బింగ్) ఫిక్సయిపోయాయి. ఇప్పుడు అల్లుడు అదుర్స్ కూడా.. పండక్కి వచ్చేస్తానంటున్నాడు. జనవరి 15న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ మూడు సినిమాలూ ఒక రోజు వ్యవధిలో విడుదల అవుతాయి. 13, 14, 15 తేదీలు పంచుకుంటున్నాయి. 12 వ తేదీ ఖాళీనే. 12న కూడా ఓ కొత్త సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు మూడు రోజుల్లో ఆ సినిమా ఏమిటన్నది ఖరారు అవుతుంది. మొత్తానికి ఈ సంక్రాంతికి 5 సినిమాలు రావొచ్చు.
ఈ సినిమాలకు బూస్టప్ ఇచ్చింది మాత్రం.. సోలో బతుకే సో బెటరు సినిమానే. క్రిస్మస్ కి విడుదలైన సినిమా ఇది. టాక్ అటూ ఇటూ ఉంది. కానీ.. థియేటర్ల దగ్గర స్పందన మాత్రం బాగుంది. రాక రాక వెండి తెరకు వచ్చిన సినిమా ఇది. అందుకే.. థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. టాక్ ని పట్టించుకోకుండా జనం థియేటర్లకు కదిలి వచ్చారు. 50 శాతం ఆక్యుపెన్సీలోనూ.. ఆకర్షణీయమైన వసూళ్లు రావడం ఆశ్చర్యం కలిగించాయి. దాంతో సంక్రాంతి సినిమాలపై ఉన్న ఆందోళన, అనుమానాలూ తగ్గాయి. జనాలకు థియేటర్లకు వచ్చే మూడ్ ఉందన్న విషయం అర్థమైంది. ఇంతకు ముందు 100 % ఆక్యుపెన్సీ ఉంటే వద్దాం.. అనుకున్న సినిమాలు కూడా… 50 శాతం సిట్టింగ్ కి సిద్ధమైపోయాయి. సంక్రాంతి లోగా కేంద్ర ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇస్తుందన్న ఆశలు ఉన్నప్పటికీ, కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండడం, ఓ కొత్త వైరస్ కలరవం సృష్టించడంతో ఆ ఆశలు సన్నగిల్లాయి. అయినా సరే.. 50 శాతం ఆక్యుపెన్సీతో వసూళ్లు పిండుకోవొచ్చన్న ఆశలు చిగురించాయి. ఈ సంక్రాంతికి వినోదాలకు ఢోకా లేనట్టే. థ్యాంక్స్ టూ.. సోలో బతుకే సో బెటర్!