తెలుగు360 రేటింగ్: 2.5/5
దాదాపు 9 నెలల నిరీక్షణ ఫలించింది. థియేటర్లు తెరచుకున్నాయి. కొత్త సినిమాల కోసం ఎదురు చూసిన ప్రేక్షకుల ముందుకు `సోలో బతుకే సో బెటరు` వచ్చింది. థియేటర్లో సినిమా చూడాలనుకున్న సగటు ప్రేక్షకుడి ఆశ తీరిన రోజు ఇది. చిత్ర సీమ కూడా.. `థియేటర్లకు వెళ్లండి.. సినిమా చూడండి..` అని ఈ సినిమా ప్రమోషన్ బాధ్యత కూడా తనపై వేసుకుంది. టాలీవుడ్ దృష్టంతా… తన వైపుకు తిప్పుకున్న ఈ సినిమా…. ఎలాంటి ఫలితాన్ని అందుకుంది. కొత్త సినిమాల రాకకు ఎంత వరకూ ఊపిరి పోసింది. సినీ అభిమాని నిరీక్షణలకు అంచనాలకూ తగ్గట్టుగా ఉందా? లేదా?
కథ
విరాట్ (సాయిధరమ్ తేజ్)కి ఎమోషన్లు ఉండవు. `సోలో బతుకే సో బెటరు` అనే నినాదం తనది. అటల్ బిహారీ వాజ్‌పేయ్.. ఆర్.నారాయణమూర్తి లాంటి వాళ్లని స్ఫూర్తిగా తీసుకుని బ్రహ్మచర్యం పాటిస్తుంటాడు. అంతేకాదు.. 108 శ్లోకాలతో ఓ పుస్తకం రాసి, యువతకు మార్గ నిర్దేశకం చేస్తాడు. తనలాంటి ఓ బ్యాచ్‌ని తయారు చేస్తాడు. వేణు మావయ్య (రావు రమేష్) వీ ఇలాంటి ఆదర్శాలే. పెళ్లి వద్దు – సోలో బతుకే బెస్టు అంటూ మేనల్లుడికి నూరిపోస్తాడు. చదువంతా అయిపోయాక… హైదరాబాద్ లో తన స్నేహితులతో స్థిరపడతాడు విరాట్. అయితే… తన బ్యాచ్ లోంచి ఒకొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తుంటారు. చివరికి తాను ఒంటరి అయిపోతాడు. వేణు మావయ్య కి కూడా `తాను నమ్మిక ఫిలాసపీ తప్పు..` అనే విషయం అర్థం అవుతుంది. అందుకే… విరాట్ కూడా.. సోలో బతుకుని వదిలేసి, జీవితంలో స్థిరపడాలనుకుంటాడు. మరి… తనకు కావల్సిన లైఫ్ పార్టనర్ దొరికిందా? లేదా? ఆ ప్రయాణంలో తాను ఏం తెలుసుకున్నాడు..? అనేదే కథ.
విశ్లేషణ
జంథ్యాల తీసిన `వివాహ భోజనంబు` కూడా ఇదే టైపు కథ. ఆ సినిమాలోనూ అంతే. హీరోకి పెళ్లంటే పడదు. ఓ సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. సూక్తులు, ఉపదేశాలూ వల్లిస్తుంటాడు. అలాంటి హీరోకి పెళ్లెలా అయ్యిందన్నదే మిగిలిన కథ. `మన్మథుడు` కూడా అంతే. `వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా` అనే టైపు హీరో లవ్ స్టోరీ. ఈ రెండింటినీ కలిపి మిక్సీలో వేస్తే `సోలో బతుకే సో బెటర్` అయ్యింది. ఓ మాటలో చెప్పాలంటే ఇది పాత కథే. అలాంటి కథని ఎంచుకోవడంలో, ఈ తరానికి చెప్పాలనుకోవడంలో తప్పు లేదు. కానీ జంథ్యాల లాంటి కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ లాంటి రైటింగ్ క్యాపబులిటీస్.. ఇలాంటి కథలకు అవసరం.
ఈ కథని ఫన్ జోనర్‌లోనే చెప్పాలి. ఎమోషన్‌తో పిండేయకూడదు గానీ, అదీ ఉండాలి. `వివాహ భోజనంబు`, `మన్మథుడు` చిత్రాల్లో అదే కనిపిస్తుంది. అది ప్లస్ అయ్యింది కూడా. `సోలో బతుకే సో బెటరు`లో ఫన్, ఎమోషన్ రెండూ ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. కానీ… వాటి మోతాదులు చాలా తక్కువ. హీరో క్యారెక్టరైజేషన్లో ఫన్ ఉంది. కానీ.. దాన్ని అల్లుకుంటూ తీసిన సన్నివేశాల్లో అంత వినోదం పండదు. ఫస్టాఫ్ లో హీరో శ్లోకాలూ, పుస్తకాలు, ఫిలాసఫీ అంటూ లాగించడానికి కాస్త ఆస్కారం దొరికింది. దానికి వెన్నెల కిషోర్ కామెడీ ప్లస్ అయ్యింది. ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా ఇంట్రస్టింగ్ గానే అనిపించింది. కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు లేవు గానీ.. `ఫర్వాలేదు లే..` అనే ఫీలింగ్ అయితే తీసుకొస్తాయి. పైగా థియేటర్‌కి వెళ్లి చాలా రోజులైంది కదా. కొన్ని మినహాయింపులు, సర్దుబాట్లూ ఇచ్చేస్తాం.
కానీ సెకండాఫ్ కూడా ఇలానే ఉంటుందంటే కుదరదు. అక్కడ ఏదో ఓ మ్యాజిక్ చేయాలి. అమృత (నభానటేషా) క్యారెక్టర్ నుంచి అలాంటి వెరైటీ పిండుకునే ఛాన్స్ దర్శకుడు సృష్టించుకున్నాడు కూడా. కానీ… దాన్ని సరైన రీతిలో వాడుకోలేకపోయాడు. తరవాత ఏం జరుగుతుంది? అనే విషయం స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. దానికి తోడు.. ఫస్టాఫ్‌లో పండిన వినోదం కూడా ద్వితీయార్థంలో కనిపించదు. ఫైట్ లేకపోతే.. జనం ఏమనుకుంటారో అనుకుని అజయ్‌ని రంగంలోకి దింపాడు. రాముడు – సీత- రావణాసురుడు అంటూ ఓ కాన్సెప్ట్ ఫైట్ ఇరికించాలని చూశారు. కాకపోతే.. ఈ తరహా కథలకు అది సెట్ అవ్వలేదు. అమృత ని పెళ్లికి ఒప్పించడం ఎంత ఈజీనో ఆసుపత్రిలో రాజేంద్ర ప్రసాద్ డైలాగుల్ని బట్టి అర్థం చేసేసుకోవొచ్చు. ఆ మాత్రం దానికి – సెకండాఫ్ అంతా లాగి లాగి ల్యాగ్ చేశారు. రావు రమేష్ పాత్ర ఎమోషన్స్ పండించడానికి వాడుకున్నాడు గానీ, ఆ పాత్రని చంపేసి లేని సింపతీ క్రియేట్ చేయాలని చూశాడు దర్శకుడు. బలమైన పాత్రలు, సంఘర్షణలు, గుర్తుండిపోయే వినోదం.. ఇవేం కనిపించకపోవడంతో.. సోలో బతుకే కాస్త సో..సో..గానే మిగిలిపోయింది.
నటీనటులు
సాయిధరమ్ తేజ్ లో మంచి ఈజ్ ఉంది. అది ఉంది కాబట్టే… ఇలాంటి సోసో పాత్రల్నీ బాగా లాగించేస్తున్నాడు. తన టైమింగ్, ఎక్స్ప్రెషన్ బాగా కలిసొచ్చాయి. తన వరకూ.. పూర్తి న్యాయం చేశాడు. కాస్త లావుగా ఉన్నాడు గానీ, కాస్ట్యూమ్ సెలక్షన్ తో కవర్ చేసేశాడు. నభా నటేషా ఇంట్రవెల్ వరకూ కనిపించదు. ఆ పాత్రని అంత వరకూ హైడ్ చేయాల్సిన అవసరమూ కనిపించదు. అమృత పాత్రని ఇంకాస్త బాగా రాసుకోగలిగితే కథలో సంఘర్షణ కాస్త బలంగా మారేది. దాంతో.. ద్వితీయార్థం నిలబడేది. అది లేకుండా పోయింది. రావు రమేష్ కనిపించేది రెండు మూడు సన్నివేశాల్లోనే. కానీ తన అనుభవంతో వాటిని నిలబెట్టేశాడు. `మెలోడ్రామా` ని మోయడంలో సాయ పడ్డాడు. రాజేంద్ర ప్రసాద్ నటన హుందాగా ఉంది. వెన్నెల కిషోర్ స్లాంగ్ అదో టైపులో ఉంది గానీ, బాగానే నవ్వించాడు.
సాంకేతిక వర్గం
తమన్ పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం.. ప్లస్ అయ్యింది. మాటలు అక్కడక్కడ మెరిశాయి. ముఖ్యంగా రావు రమేష్ డైలాగుల్లో. `కొన్నిసార్లు కన్నీళ్లు తుడుచుకోవడానికి మనరెండు చేతులూ సరిపోవు.` అన్న డైలాగ్ బాగుంది. సుబ్బు రాసుకున్న కథ చాలా చిన్నది. దానికి బలమైన పాత్రలు, సన్నివేశాలు అవసరం. కామెడీని గుప్పించి ఈ సినిమా నడపాలి. సుబ్బు రాసుకున్న సన్నివేశాల్లో వినోదం ఉన్నా – సినిమాని కాపాడేంత స్కోప్ దానికి లేదు.
చాలా రోజుల తరవాత థియేటర్లు తెరిచారు. థియేటర్లో సినిమా చూసే అనుభవం.. ఆనందం కావాలంటే.. ఈ సినిమా చూడొచ్చు.. అంతకంటే ఎక్కువ ఆశిస్తే కష్టమే.
తీర్పు:
ఎంటర్టైన్మెంట్ పండించడానికి చాలా స్కోప్ ఉన్న లైన్ పట్టుకున్నా – సరైన పాత్రలు, సన్నివేశాలు రాసుకోకపోవడంతో, రాసుకున్న ఆ చిన్న లైన్ కూడా బలహీనమైపోయింది. విరాట్ క్యారెక్టరైజేషన్, వెన్నెల కిషోర్ కామెడీ, పాటలూ…కాస్త బలాన్ని అందించాయి. స్క్రిప్టు ఇంకొంచెం బెటర్ గా రాసుకుంటే.. ఇంకొన్ని హిలేరియస్ కామెడీ సీన్లు డిజైన్ చేసుకుని ఉంటే.. ఫలితం మరింత బాగుండేది.
తెలుగు360 రేటింగ్: 2.5/5