తెలంగాణలో ఇప్పుడు తెరాస తిరుగులేని రాజకీయ శక్తి అనడంలో సందేహం లేదు. తిరుగులేని మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చాక… ఇతర పార్టీల్లో కాస్తోకూస్తో మిగిలిన నాయకులు కూడా తెరాస గూటికి చేరుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది ఆ పార్టీ గూటికే చేరిపోయారు. తెలంగాణలో నాయకులు పార్టీ మారుతున్నారంటే… ఇతర పార్టీల నుంచి తెరాసలోకి అనే వార్తలు చూస్తున్నాం. అధికారంలో ఉన్న తెరాసకు దూరమయ్యేవారు ఇప్పుడెవరుంటారు..? ఎందుకుంటారు అనుకుంటాం..? కానీ, ఈ పరిస్థితుల్లో కూడా తెరాసకు గుడ్ బై చెప్పారు రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ.
2014లో ఆయన తెరాస తరఫున పోటీ చేసి గెలిచారు. అంతకుముందు, కొన్నాళ్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ నుంచి టిక్కెట్ రాకపోయేసరికి.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తెరాసలో చేరాక ఆయనకి ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చారు సీఎం కేసీఆర్. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస నుంచి టిక్కెట్ దక్కింది. కానీ, స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. కేసీఆర్ తో సాన్నిహిత్యం ఉండి, తెరాస అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీకి ఎందుకు దూరమైనట్టు..? ఈ ప్రశ్నకి ఆయన చెబుతున్న సమాధానం ఏంటంటే… పార్టీలో కొంతమంది అజమాయిషీని తట్టుకోలేకపోతున్నా అన్నారు! గత ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి కారణం కూడా కొంతమంది తెరాస నేతలే అనీ, వారిలో బాల్క సుమన్ ఉన్నారనీ ఆరోపించారు. గౌరవమూ మర్యాద దక్కనప్పుడు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా.. దాన్ని వదులుకోవాల్సి వస్తుందన్నారు. తెరాసలో క్రమశిక్షణ లోపిస్తోందనీ, అందుకే తనతోపాటు కొందరు అనుచరులు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారనీ, తనవారందరినీ పురపాలక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపించుకుంటా అన్నారు.
తెరాసకు గుడ్ బై చెప్పింది మాజీ ఎమ్మెల్యే అయినా… అధికార పార్టీకి దూరమవడం విశేషం! పార్టీలో కొంతమంది పెత్తనం పెరిగిపోయిందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ మధ్య కాలంలో తెరాసలో ఇలాంటి పరిస్థితి ఉందని ఓపెన్ గా మాట్లాడిన నాయకులు లేరు. నిజంగానే, అలాంటి పరిస్థితులు పార్టీలో అంతర్గతంగా ఉన్నా కూడా, బయటపడే ధైర్యం ఉండదనే చెప్పాలి. ఇతర పార్టీల నేతలంతా తెరాసలో చేరాలని చూస్తుంటే… ఆ పార్టీ నుంచి బయటకి వచ్చిన నాయకులు కూడా ఉండటం అనేది, ప్రస్తుత పరిస్థితుల్లో అనూహ్యమైన అంశమే. దీన్ని భాజపా సొమ్ముచేసుకునే అవకాశం ఉంది. సత్యనారాయణ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించినా, ఆయనతో భాజపా నేతలు టచ్ లోకి వెళ్లినట్టు సమాచారం.