కె. విశ్వనాథ్… నిర్మాతల దర్శకుడేం కాదు. తాను అనుకొన్నది అనుకొన్నట్టు తీసే రకం. కమర్షియాలిటీని కాదు.. కథని నమ్మి సినిమాలు తీస్తారాయన. తాను అనుకొన్నదే ట్రెండ్. హీరోలు సైతం తమ ఇమేజ్‌ని పక్కన పెట్టి, ఆయన సృష్టించే పాత్రల్లో ఒదిగిపోవాల్సివస్తుంది. అందుకే ఆయన సినిమాలకు అవార్డులు వస్తాయి. కానీ గంపగుత్తగా వసూళ్లొచ్చిన దాఖలాలు, కమర్షియల్ రికార్డులు బద్దలు కొట్టిన సందర్భాలూ తక్కువే. ‘నాకు డబ్బులు పోయినా ఫర్వాలేదు.. మంచి సినిమా వస్తే చాలు’ అనుకొన్నవాళ్లకే విశ్వనాథ్ సినిమా తీసిపెట్టేవార్ట. కొంతమందికైతే `నేను మీకు సినిమా తీయను` అని నిర్మొహమాటంగా చెప్పేసేవార్ట. దాంతో కె.విశ్వనాథ్ అహంకారి.. అని పరిశ్రమలో చెప్పుకొనేవార్ట.
ఈ విషయాన్ని విశ్వనాథే… గుర్తు చేసుకొన్నారు. ”నేను దర్శకత్వం వహించిన సినిమాల్లో సిరిసిరిమువ్వ, సిరివెన్నెల అనుకొన్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టాను. మిగిలిన సినిమాలకు బొటా బొటీగా డబ్బులు వచ్చేవి. దాంతో.. నాతో సినిమా చేస్తే నిర్మాత నష్టపోతాడేమో అనే భయం పట్టుకొంది. అందుకే సినిమా తీసి పెట్టమని నిర్మాతలెవరైనా నా దగ్గరకు వస్తే…. తీయను అని చెప్పేవాడ్ని. నా బాద అర్థం చేసుకోక.. వాళ్లు నొచ్చుకొనేవార”` అంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయారు విశ్వనాథ్.