తెలంగాణకు కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వచ్చారు. రెవెన్యూ శాఖ సెక్రటరీగా పనిచేస్తున్న సోమేష్ కుమార్ ని సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం సాయంత్రమే ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. 2023 డిసెంబర్ నెలాఖరు వరకూ ఆయన పదవిలో కొనసాగుతారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే, ముఖ్యమంత్రిని కేసీఆర్ ని సోమేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాల మేరకు, అందర్నీ కలుపుకుంటూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని కొత్త సీఎస్ చెప్పారు.
సీఎస్ గా సోమేష్ కుమార్ నియామకం మీద ఉన్నతాధికార వర్గాల్లో కొంత చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఎందుకంటే, సీనియారిటీ ప్రకారం చూసుకుంటే సోమేష్ కుమార్ కంటే ముందు దాదాపు 12 మంది ఐ.ఎ.ఎస్. అధికారులు తెలంగాణలో ఉన్నారు. వారందర్నీ దాటుకుని ఈయనకే బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన కంటే సీనియర్లు ఉంటుండగా సోమేష్ కుమార్ కి అవకాశం ఎలా ఇస్తారనే అంశాన్ని కొంతమంది ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. అంతేకాదు, ఏపీ విభజన తరువాత ఐ.ఎ.ఎస్. అధికారుల పంపకాల్లో సోమేష్ కుమార్ ని ఏపీ కేడర్ కి పంపించారు. కానీ, ఆయన తెలంగాణలోనే కొనసాగుతానని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ లో కేసు దాఖలు చేసి, ఇక్కడే కొనసాగుతున్నారు. ఈ అంశాన్ని కూడా సీఎం ముందు కొందరు అధికారులు ప్రస్థావించారని సమాచారం. ఇవేవీ కేసీఆర్ పరిగణనలోకి తీసుకోలేదు.
సీఎస్ రేసులో ఈయనతోపాటు అజయ్ మిశ్రా పేరు కూడా ఆ మధ్య బలంగా వినిపించింది. సీఎంతో మంచి సంబంధాలు ఈయనకీ ఉన్నాయి కాబట్టి, అవకాశం ఉంటుందని ఆయనా ఆశించారు. కానీ, తనకంటే జూనియర్ అయిన సోమేష్ కుమార్ పేరు ప్రభుత్వం ప్రకటించడంతో అజయ్ మిశ్రా అసంతృప్తికి గురయ్యారు. సోమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించడానికి కాసేపు ముందే ఆయన అసంతృప్తితో ఇంటికి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రికి వీర విధేయుడు కాబట్టే సోమేష్ కు అవకాశం దక్కిందని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. అంతేకాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగానే ఈయనకీ వాస్తు నమ్మకాలు లాంటివి చాలా ఎక్కువనీ, ఇప్పుడాయన బాధ్యతలు స్వీకరించినా తన ఛాంబర్లో వాస్తు ప్రకారం మార్పులు చాలా ఉంటాయని అధికారులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నమ్మకాలు, పట్టింపుల విషయంలో ముఖ్యమంత్రికి ఈయన కూడా తోడౌతారని అంటున్నారు!